
ఏపీ భవన్‌లో పెరిగిన బీపీ
ఇరుప్రాంత జేఏసీల నిరసనలతో వేడెక్కుతున్న ఏపీ భవన్
బుధవారం సైతం కొనసాగిన పోటాపోటీ నిరసనలు
ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు నేపథ్యంలో దేశ రాజధానిలో మోహరించిన ఇరుప్రాంత జేఏసీ నేతల ఆందోళనలతో ఏపీభవన్ వేడెక్కుతోంది. తెలంగాణ, సీమాంధ్ర జేఏసీలు పోటాపోటీ నిరసనలకు దిగుతుండడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరికొకరు ప్రతినినాదాలు, నేతల అడ్డగింతల నేపథ్యంలో అప్రమత్తమయిన ఢిల్లీ పోలీసులు భారీగా భవన్‌లో మోహరించారు. గురువారం విభజన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉండటంతో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుం డా పోలీసులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు.
బుధవారం సైతం ఏపీభవన్‌లో పోటాపోటీ నిరసనలు కొనసాగాయి. ఓవైపు తెలంగాణ విద్యార్థి, రాజకీయ, న్యాయవాద జేఏసీలు అంబేద్కర్ విగ్రహం వద్ద సంపూర్ణ తెలంగాణకు మద్దతుగా నిరసనలకు దిగగా, సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్‌జీవోలు పక్కనే భవన్ మెట్ల వద్ద బైఠాయించారు. పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణవాదులు బోనాలతో పాటలు పాడుతూ తమ నిరసనను సాయంత్రం వరకు కొనసాగించారు. ఏపీఎన్జీవోలు సైతం సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ మధ్యాహ్నం వరకు అక్కడే నిరసన తెలిపారు.
ఏపీ భవన్ మాదే: ఓయూ జేఏసీ
ఇక సాయంత్రం ఏపీ భవన్ తెలంగాణదే అంటూ ఓయూ జేఏసీ విద్యార్థి నేతలు నిరసనకు దిగారు. ‘నిజాం ఆస్తి.. తెలంగాణ ప్రజల ఆస్తి, ఆంధ్రాభవన్ కాదు.. తెలంగాణ భవన్’ అంటూ రాసిన భారీ ఫ్లెక్సీని ఏపీభవన్ ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. దీనిపై భవన్ అధికారులు అభ్యంతరం చెబుతూ దాన్ని తొలగించేందుకు ప్రయత్నించినా, విద్యార్థుల ఆందోళనతో మిన్నకుండిపోయారు.
మీడియా సెంటర్ ఎత్తివేత..
పోటీ నిరసనలు, మీడియా ముందు పోటాపోటీ నినాదాల నేపథ్యంలో ఏపీ భవన్‌లో మీడియాపై ఢిల్లీ పోలీసులు ఆంక్షలు విధించారు. బుధవారం భవన్‌లో శాంతిభద్రతలను పర్యవేక్షించిన తిలక్‌మార్గ్ పరిధి డీసీపీ త్యాగి అక్కడి మీడియా సెంటర్‌ను ఎత్తేయించారు. సుమారు 50 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయించారు. భవన్ బయట మీడియాతో సీమాంధ్ర నేతలు చలసాని శ్రీనివాస్, అడారి కిశోర్ మాట్లాడుతుండగా తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.