
తెలంగాణలో 85.09 % హిందువులు
* 12.65 శాతం ముస్లింలు
* మూడో స్థానంలో క్రిస్టియన్లు
* మతాల వారీగా జనాభా వివరాల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జనాభాలో అత్యధికంగా 85.09 శాతం హిందువులున్నారు. ఆ తర్వాత స్థానం లో 12.65 శాతం ముస్లింలు ఉన్నారు. 1.27 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. కేవలం 0.086 శాతం మంది సిక్కులు, 0.092 శాతం బౌద్ధులున్నారు.
0.075 శాతం జైనులున్నారు. మరో 0.678 శాతం మంది ఏ మతాన్ని వెల్లడించని వారున్నారు. జనాభా గణాంకాల్లో తేలి న ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా భారత జనగణన విభాగం మంగళవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
అందులో నుంచి తెలంగాణలోని పది జిల్లాల్లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు తదితర మతాల వివరాలను పరిగణనలోకి తీసుకుంటే.. రాష్ట్రంలో మతాల వారీగా జనాభా లెక్క తేలింది. తెలంగాణలో మొత్తం 3.51 కోట్ల జనాభా ఉంది. హిందువులు 2.99 కోట్లు, ముస్లింలు 44.64 లక్షలు, క్రైస్తవులు 4.47 లక్షలు, సిక్కులు 30,340 మంది, బౌద్ధులు 32,553, జైనులు 26,690 మంది ఉన్నారు. ఇతర మతాలకు చెందిన వారు 5,422 మంది ఉన్నారు. మతాన్ని వెల్లడించని వారు, ఏ మతానికి చెందని వారు 2.38 లక్షల మంది ఉన్నారు.
జిల్లాల వారీగా చూస్తే తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌లలో ముస్లింల జనాభా శాతం ఎక్కువగా ఉంది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 17.13 లక్షల మంది ముస్లింలున్నారు. క్రైస్తవుల జనాభా రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఉంది. హైదరాబాద్, నల్లగొండ జిల్లాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 32,553 మంది బౌద్ధ మతస్తులు ఉంటే.. అందులో ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యధికంగా 25,510 మంది ఉన్నారు.