మళ్లీ తెరచుకున్న బ్రహ్మ దేవాలయం
బ్యాంకాక్ : థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లోని సోమవారం బాంబు పేలుడు సంభవించిన బ్రహ్మా దేవాలయం తిరిగి బుధవారం తెరుచుకుంది. ఈ రోజు ఉదయం దేవాలయాన్ని తెరిచారు. దేవాలయంలో బౌద్ధ బిక్షువులు ప్రార్థనలు నిర్వహించారు. భారీగా భక్తులు దేవాలయానికి వచ్చి దేవుడిని దర్శించుకున్నారు. సోమవారం బ్యాంకాక్లోని బ్రహ్మా దేవాలయంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 20 మంది మరణించారు. మృతుల్లో తొమ్మిది మంది విదేశీయులున్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇటువంటి పేలుడు థాయ్లాండ్ చరిత్రలో ఎప్పుడు చోటు చేసుకోలేదని ఉన్నతాధికారులు వివరించారు. మృతుల్లో ఏడు మృతదేహాలను గుర్తించవలసి ఉందని చెప్పారు. సీసీ ఫుటేజ్లో గుర్తించిన అనుమానితుడి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు జాతీయ పోలీసు అధ్యక్షుడు తెలిపారు. ఆ క్రమంలో అతడు అక్కడి తీసుకు వచ్చిన ట్యాక్సీ డ్రైవర్ను విచారిస్తున్నామన్నారు. ఈ పేలుడులో దేవాలయంలోని బ్రహ్మా దేవుని విగ్రహం యొక్క గెడ్డం, చెయ్యి స్వల్పంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.