సాక్షి, హైదరాబాద్: పంట రుణమాఫీ నిధులు భారీ మొత్తంలో దుర్వినియోగమయ్యాయి. ఈ పథకంలో జరిగిన అవకతవకలతో కనీసం పది శాతం నిధులు అంటే సుమారు రూ.850 కోట్లు పక్కదారి పట్టినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఇటీవల స్థానిక నిధుల ఆడిట్ విభాగం మెదక్ జిల్లాలో నిర్వహించిన ఆడిట్‌లో అక్రమాలు బయటపడ్డాయి. బోగస్ పేర్లు, నకిలీ పాసు పుస్తకాలు, ఒకే సర్వే నంబర్‌తో వేర్వేరు పట్టాదారు పాసు పుస్తకాలు, ఒక ఎకరం భూమి ఉంటే.. పక్కన సున్నా చేర్చి పది ఎకరాలు ఉన్నట్లుగా రుణాలు పొందడం, వేర్వేరు బ్యాంకుల నుంచి పంట రుణాలు అందుకోవడం...
ఇలా రకరకాలుగా ఈ అవకతవకలు జరిగినట్లు ఆడిట్ అధికారులు ఆర్థిక శాఖకు నివేదిక సమర్పించారు. ఈ జిల్లాలో రుణమాఫీ పథకంలో లబ్ధి పొందిన రైతుల్లో.. మచ్చుకు పది శాతం మందికి సంబంధించిన ఖాతాలను, భూములను, వ్యక్తులను క్షేత్రస్థాయిలో పేరుపేరునా పరిశీలించింది. అందులో గుర్తించిన అవకతవలన్నింటినీ సమగ్రంగా ఇందులో పొందుపరిచింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ ఆడిట్ చేయించి.. నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయం తీసుకుంది.
ఆడిట్ నివేదికల ఆధారంగా మరోసారి క్షేత్రస్థాయి విచారణకు సర్కారు ఆదేశించింది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం సంగారెడ్డికి వెళ్లి విచారణ నిర్వహించారు. ఆడిట్‌లో తేలిన అంశాలను ధ్రువీకరించుకునేందుకు కొన్ని బ్యాంకర్ల రికార్డులను, రైతుల ఖాతాలను పరిశీలించారు. ప్రభుత్వం రూ.17 వేల కోట్లు రుణమాఫీ పథకానికి కేటాయించగా, ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.8,500 కోట్లు చెల్లించింది.
రెండో విడత చెల్లింపులకు ముందే ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో ఆర్థిక శాఖ కలెక్టర్ల సారథ్యంలో ప్రయోగాత్మకంగా సర్వే చేయించింది. అప్పుడే రుణమాఫీలో భారీ మొత్తంలో అక్రమాలు జరిగాయని అంచనాకు వచ్చింది. తాజాగా ఆడిట్ విభాగం మెదక్ జిల్లాలో చేపట్టిన ఆడిట్‌తో అవకతవకల స్వరూపం మొత్తం బయటపడింది.
కనీసం పది శాతం నిధులు దుర్వినియోగమైనట్లు అంచనా వేస్తున్నామని, వీటికి అడ్డుకట్ట వేయటం ద్వారా ప్రభుత్వానికి కనీసం రూ.850 కోట్లు మిగులుతాయని ఆర్థిక శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఆడిట్ నివేదిక ఆధారంగా ఆర్థిక శాఖ అధ్వర్యంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తి స్థాయి విచారణ పూర్తయితే ఎంత మొత్తం దుర్వినియోగమైందనేది పక్కాగా లెక్క తేలుతుందన్నారు. అక్రమంగా జరిగిన చెల్లింపులను సైతం రికవరీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు చెప్పారు.
రూ.850 కోట్లు దుర్వినియోగం
Published Thu, Aug 27 2015 3:32 AM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM
Advertisement
Advertisement