రాష్ట్రానికి కేంద్ర బలగాలు
ఒకే సమయంలో అసెంబ్లీ సమావేశాలు, బక్రీద్, గణేశ్ నిమజ్జనం
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాలు, బక్రీద్, గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉండేందుకు పోలీసు ఉన్నతాధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 25న బక్రీద్ పండుగ, 27న గణేశ్ నిమజ్జనం ఉండటంతో పోలీసులు రాజధాని నగరాన్ని పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ప్రస్తుతం నగర కమిషనరేట్‌పరిధిలో 12 వేల మంది, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 7 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారు.
వీరికి తోడు జిల్లాల నుంచి 7వేల మందిని రప్పించారు. అదేవిధంగా రాష్ట్ర విజ్ఞప్తి మేరకు కేంద్రం నుంచి వెయ్యి మంది సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 500 మంది పోలీసులు వచ్చారు. అలాగే రాష్ట్రంలోని 62 వేల మంది పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.
హైదరాబాద్‌పై పటిష్ట నిఘా
నగరంలో మూడు ప్రధాన ఘటనలు ఒకేసారి ఉండటంతో రాత్రి పగలు తేడా లేకుండా మూడు షిఫ్టుల్లో సిబ్బంది పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన చోటుచేసుకున్నా ఉన్నతాధికారులకు చేరేలా స్పెషల్‌బ్రాంచ్ (ఎస్‌బీ), ఇంటెలిజెన్స్ పోలీసులను అప్రమత్తం చేశారు. భారీగా సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. సీసీ కెమెరాలన్నింటినీ అత్యాధునిక కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానించి, ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసేలా పటిష్ట చర్యలు చేపట్టారు. వీటికి తోడు వెహికిల్ మౌంట్ కెమెరాల ద్వారా ప్రతీక్షణం రికార్డు చేయనున్నారు. ఈ వాహనాల ద్వారా 360 డిగ్రీల కోణంలో 500 మీటర్ల వరకు దృశ్యాలను బంధించనున్నారు. 30 బాంబు డిస్పోజల్స్, 30 డాగ్ స్క్వాడ్ బృందాలు పర్యవేక్షణలో ఉండేలా చర్యలు చేపట్టారు.
జిల్లాలకు హెచ్చరికలు
ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఇద్దరు మావోయిస్టుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో వారి కదలికలు ముమ్మరమయ్యాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాల నుంచి 40 శాతం పోలీసు సిబ్బంది హైదరాబాద్ రావడంతో అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మావోయిస్టు ప్రాబల్యం కలిగిన జిల్లాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మావోయిస్టు కదలికలున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం.