
హోదాకు సమానంగా ఏపీ అభివృద్ధి
♦ కేంద్ర మంత్రి దత్తాత్రేయ
♦ టీడీపీ, బీజేపీల మధ్య విభేదాల్లేవని వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాకు సమానంగా ఉండేలా తగినంత సహాయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అందిస్తుందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ఉన్నత విద్యాసంస్థలు ఇచ్చామని, ఇతర ప్రాజెక్టులన్నీ ఇస్తామని.. ఇవన్నీ ప్రత్యేక హోదాకు ఇంచుమించు సమానంగా ఉన్నాయన్నారు. ఢిల్లీలోని కార్మిక మంత్రిత్వశాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా శకం ముగిసిపోయిందని పట్నాలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు మంత్రి దత్తాత్రేయ సమర్థిస్తూనే పై విధంగా బదులిచ్చారు.
ప్రత్యేక హోదాకు సమానంగా ఏపీని కేంద్రం అభివృద్ధి చేస్తుందన్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటించే అవకాశాల్లేవా అని అడగ్గా.. ‘నేను అనడంలేదు కదా’ అంటూ బదులిచ్చారు. ఏపీలో టీడీపీ, బీజేపీల మధ్య భేదాభిప్రాయాల్లేవని చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బాలకార్మిక చట్టం-2015, బోనసు చట్టం-2015లను ప్రవేశ పెట్టనున్నట్టు దత్తాత్రేయ తెలిపారు. వేతనాల నిబంధనలు, పారిశ్రామిక సంబంధాలపై నిబంధనలను, ఈపీఎఫ్ బిల్లు-2015, భవన, ఇతర నిర్మాణరంగాల కార్మికుల బిల్లు -2013లను కేంద్ర కేబినెట్ ముందుంచనున్నామని వివరించారు.
దేవాదులపై టీఆర్‌ఎస్ ప్రభుత్వ బాధ్యతేది
దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంలేదని నాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన టీఆర్‌ఎస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ బాధ్యత ఎందుకు నెరవేర్చడంలేదని దత్తాత్రేయ ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.