గొప్ప ముందడుగు
పారిస్ ఒప్పందంపై వివిధ దేశాధినేతలు
పారిస్: భూతాపోన్నతిని రెండు డిగ్రీల లోపునకు పరిమితం చేసేందుకు కుదుర్చుకున్న వాతావరణ ఒప్పందం గొప్ప ముందడుగు అని ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా వివిధ దేశాధినేతలు పేర్కొన్నారు. ఈ ఒప్పందం దిశగా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. అయితే పర్యావరణవేత్తల నుంచి మాత్రం భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పారిస్‌లో జరిగిన వాతావరణ సదస్సులో అంతర్జాతీయంగా చట్టబద్ధమైన ఒప్పందం కుదరడం తెలిసిందే. ‘దేశాలన్నీ కలసి ముందుకెళితే ఏం సాధించగలమో ఈ ఒప్పందం రుజువు చేస్తోంది. భూమిని రక్షించుకునేందుకు ఉన్న మంచి అవకాశం ఇది.
ప్రపంచానికి ఇదో గొప్ప మలుపు.’ అని వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఒబామా పేర్కొన్నారు. ఒప్పందం పేదరికం నిర్మూలన, అందరూ అభివృద్ధి చెందేందుకు తోడ్పడుతుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ పేర్కొన్నారు. భూమి చరిత్రలో ఇదొక మంచి రోజు అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే చెప్పారు. ఒప్పందం అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కులకు మద్దతుగా నిలుస్తుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. కాగా, ఒప్పందం పూర్తి బలహీనంగా ఉందని, బాధ్యత వహించాల్సిన అభివృద్ధి చెందిన దేశాలను ఆ బాధ్యతల నుంచి తప్పించిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డెరైక్టర్ జనరల్ సునీతా నారాయణ్ విమర్శించారు.
‘పర్యావరణమే విజేత’
న్యూఢిల్లీ: పారిస్ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘ఇది హరిత భవిత దిశగా కుదిరిన ఒప్పందం. ఇందులో విజేతలు, పరాజితులు లేరు. పర్యావరణ న్యాయమే విజేత’ అని అభివర్ణించారు. వాతావరణ మార్పు సవాలును ప్రతీ దేశం స్వీకరించిన విధానాన్ని కొనియాడారు. ప్రపంచ దేశాల నేతల సమీకృత దార్శనికతను పారిస్ చర్చలు ప్రతిఫలించాయని ట్విటర్లో ప్రశంసించారు. ఒప్పంద తుది ముసాయిదా సిద్ధం కాగానే, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్.. మోదీకి ఫోన్ చేసి ముఖ్యాంశాలను చెప్పారని ప్రధాని కార్యాలయం తెలిపింది. హోలాండ్ వ్యవహరించిన తీరును ప్రధాని కొనియాడారంది.