
వడ్డీరేట్లు యథాతథం..!
రేపే ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష
ఫెడరల్ రిజర్వ్ పాలసీ నేపథ్యంలో వేచిచూసే ధోరణి ఉండొచ్చు...
{దవ్యోల్బణం పెరుగుతుండటంపైనా దృష్టి...
ఆర్‌బీఐ పాలసీపై నిపుణుల అభిప్రాయం...
ముంబై: గడిచిన పాలసీ సమీక్షలో వడ్డీరేట్లను అనూహ్యంగా అరశాతం తగ్గించిన రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఈసారి పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. రేపు(మంగళవారం) ఆర్‌బీఐ ద్వైమాసిక పాలసీ సమీక్షనును చేపట్టనుంది. ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ 15-16 తేదీల్లో జరిపే పాలసీ సమీక్షలోవడ్డీరేట్లను దశాబ్దం తర్వాత తొలిసారిగా పెంచొచ్చన్న వార్తలు బలపడుతుండటం.. దేశీయంగా గత మూడు నెలల్లో ద్రవ్యోల్బణం మళ్లీ పుంజుకుంటున్న తరుణంలో ఆర్‌బీఐ వేచిచూసే ధోరణిని అవలంబించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బ్యాంకర్లు ఏమంటున్నారు...
‘ఫెడరల్ రిజర్వ్ పాలసీ ప్రకటన కోసం ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వేచిచూసే అవకాశం ఉంది. దీంతో ఈసారి సమీక్షలో పాలసీ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చు’ అని యూకో బ్యాంక్ ఎండీ, సీఈఓ ఆర్‌కే టక్కర్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుండటం ఆందోళనకరమైన అంశం. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ పాలసీ యథాతథంగానే కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు యునెటైడ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సంజర్ ఆర్య వ్యాఖ్యానించారు. అయితే, దీర్ఘకాలికంగా చూస్తే వడ్డీరేట్లు మరింత దిగొచ్చే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
నిపుణుల మాట ఇదీ: గతంలో మాదిరిగా ప్రస్తుత సమీక్షలో ఆర్‌బీఐ నుంచి ఎలాంటి ఆశ్చర్యకరమైన నిర్ణయాలకూ అవకాశం లేదని అంతర్జాతీయ బ్రోకరేజి దిగ్గజాలు సిటీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్‌ఏ-ఎంఎల్) విశ్లేషకులు పేర్కొంటున్నారు. రేపటి సమీక్షలో ఆర్‌బీఐ ఎలాంటి పాలసీలో మార్పులేవీ ఉండకపోవచ్చని... అయితే, ఫిబ్రవరిలో జరిగే సమీక్షలో మాత్రం పావు శాతం రెపో కోతకు ఆస్కారం ఉందని బీఓఎఫ్‌ఏ-ఎంఎల్ తన రీసెర్చ్ నోట్‌లో తెలిపింది. సిటీ గ్రూప్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుపై నెలకొన్న అనిశ్చితి, ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ఉన్న తరుణంలో ఆర్‌బీఐ పాలసీ ప్రస్తుతానికి యథాతథంగానే కొనసాగవచ్చని పేర్కొంది. 2016లో మొత్తంమీద అర శాతం వరకూ పాలసీ రేటు తగ్గొచ్చనేది సిటీ గ్రూప్ అంచనా. సిరియాలో తీవ్రతరమవుతున్న అంతర్యుద్ధం, టర్కీ-సిరియాల మధ్య ఘర్షణ వాతావరణం, ఐఎస్ ఉగ్రవాద దాడులు ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుండటం.. ఇతరత్రా అంతర్జాతీయ పరిణామాలు ఆర్‌బీఐ పాలసీ సమీక్షలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అసోచామ్ పేర్కొంది. దీంతో ఈ సారి సమీక్షలో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చని అంచనా వేస్తోంది.
ప్రస్తుతం రేట్లు ఇలా...
ప్రస్తుత ఆర్‌బీఐ రెపో రేటు(బ్యాంకులు స్వల్పకాలికంగా తీసుకునే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) 6.75 శాతంగా, రివర్స్ రెపో(ఆర్‌బీఐ వద్ద ఉంచే నిధులపై బ్యాంకులకు లభించే వడ్డీరేటు) 5.75 శాతం వద్ద ఉన్నాయి. సెప్టెంబర్ పాలసీ సమీక్షలో రెపోరేటును ఆర్‌బీఐ అరశాతం తగ్గించిన సంగతి తెలిసిందే. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్- బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన పరిమాణం) 4 శాతంగా కొనసాగుతోంది. ఇక ద్రవ్యోల్బణం విషయానికొస్తే... అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా నిత్యావసర ఆహారోత్పత్తుల ధరలు ఎగబాకుతుండటం ఆందోళనకరమైన అంశం. టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) అక్టోబర్‌లో మైనస్ 3.81 శాతంగా నమోదైంది. ఆహార విభాగంలో మాత్రం 2.44 శాతంగా ఉంది. జనవరి 2016 నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 5.8 శాతానికి చేరొచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది.