టీడీపీని ఇంకెన్నాళ్లు మోద్దాం? | The state BJP leaders acute accent | Sakshi
Sakshi News home page

టీడీపీని ఇంకెన్నాళ్లు మోద్దాం?

Published Mon, Apr 13 2015 3:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

టీడీపీని ఇంకెన్నాళ్లు మోద్దాం? - Sakshi

టీడీపీని ఇంకెన్నాళ్లు మోద్దాం?

  • రాష్ట్ర బీజేపీ నేతల తీవ్ర స్వరం
  • విశాఖలో ముగిసిన కార్యవర్గ సమావేశం
  • పురందేశ్వరి కన్వీనర్‌గా ప్రచార కమిటీ
  • సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎన్నికల సమయంలో కలసికట్టుగా పనిచేసిన బీజేపీ, టీడీపీ మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతోంది. విశాఖ కేంద్రంగా ఆదివారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ నేతల మనోభావాలు దీనిని ప్రతిబింబించాయి.‘ మన వల్లే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది.. ఇప్పుడు కూడా దానిని మోస్తున్నాం.. ఆ పార్టీ వైఫల్యాలకు బాధ్యులమవుతున్నాం.. అయినా వివక్షకు గురవుతున్నాం.. మన పార్టీకి, కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదు.. ఇకనైనా సొంతంగా ఎదుగుదాం’ అంటూ రాష్ట్ర నేతలు ఆవేదనతోపాటు ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు.

    ఈ సమావేశానికి హాజరైన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్  జగత్ ప్రకాష్ నడ్డా సమక్షంలోనే తీవ్రస్థాయిలో వారంతా అసంతృప్తి స్వరం వినిపించారు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, సీనియర్ నేతలు సోము వీర్రాజు, శాంతారెడ్డిలతోపాటు దాదాపు ప్రధాన నేతలంతా ఇదే విషయాన్ని బలంగా వినిపించారు.యువ నేతలు ఈ వాదనను బలపరిచారు.  కాగా టీడీపీ ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తుండడంతో ఇక నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది.

    కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్రానికి ఇస్తున్న నిధులపై విస్తృత ప్రచారం చేయాలని తీర్మానించారు. ఈ నెలాఖరు నాటికి సభ్యత్వ నమోదు పూర్తిచేసి ఆ తరువాత ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ‘జనసంపర్క్ మహాసంపర్క్ అభియాన్’ అనే పేరిట చేపట్టే ఈ కార్యక్రమానికి పురందేశ్వరిని కన్వీనర్‌గా నియమించారు.  
     
    ప్రత్యేక హోదా తప్ప ఏసాయమైనా: కేంద్ర మంత్రి నడ్డా
     
    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తప్ప ఎలాంటి సాయాన్నైనా చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి జేపీ నడ్డా ఉద్ఘాటించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ఉన్నత విద్యా సంస్థలను కేంద్రం నెలకొల్పుతుందన్నారు. ‘ఏపీకి ప్రత్యేక హోదా అనే పదాన్ని వాడొద్దు. దీంతో నిమిత్తం లేకుండా.. రాష్ట్రానికి అన్ని నిధులూ ఇస్తాం’ అని నడ్డా పేర్కొన్నారు.

    దీనికిముందు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. యూపీ, గుజరాత్, రాజస్థాన్‌లలో మాదిరిగా ఏపీలోనూ బీజేపీ బలీయశక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఎంపీ హరిబాబు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దేశ ప్రగతికి బాటలు వేస్తోందన్నారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement