నడినెత్తిన నిప్పులే..!
- గతేడాది కంటే ఈసారి పెరగనున్న ఉష్ణోగ్రతలు ∙45 నుంచి 48 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం
- వారం ముందుగానే వేసవిలోకి ప్రవేశం ∙గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతోనే అంటున్న శాస్త్రవేత్తలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అప్పుడే మహబూబ్ నగర్‌లో రెండుసార్లు ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ చొప్పు న గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవంగా మార్చి ఒకటో తేదీ నుంచి వేసవి సీజన్ మొదలు కావాలి. కానీ వారం ముందుగానే అంటే ఫిబ్రవరి చివరి వారంలోనే ఎండా కాలంలోకి ప్రవేశించామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
గత 24 గంటల్లో మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో సాధారణం కంటే ఐదు డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 38 డిగ్రీలు... మహబూబ్‌నగర్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. హకీంపేట, హన్మకొండ, ఖమ్మంలలో సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలా రాష్ట్రం అప్పుడే అగ్నిగుండంలోకి వెళ్తోంది. గ్లోబల్ వార్మింగ్, పట్టణీకరణ నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాస్త్రజ్ఞులు విశ్లేషిస్తున్నారు.
గతేడాది కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువే...
ఫిబ్రవరిలోనే ఈ స్థాయిలో ఎండలు మండుతుండటంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన నెలకొంది. గతేడాది ఫిబ్రవరి 23వ తేదీన మెదక్‌లో 39.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే 24వ తేదీన హన్మకొండలో 39.1 డిగ్రీలు, నిజామాబాద్‌లో 40.6 డిగ్రీలు నమోదైంది. గ్లోబల్ వార్మింగ్, పట్టణీకరణ ఫలితంగా 1980 నుంచి ప్రతీ పదేళ్లకు ఒకసారి 0.01 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుందని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో ఈ ఎండాకాలంలోనూ రాష్ట్రంలో గతేడాది కంటే కూడా అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంటోంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు రాష్ట్రంలో ఎండలు నమోదు కావాలి.
అయితే ఈసారి మాత్రం 45 నుంచి 48 డిగ్రీల వరకు కూడా ఎండలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టంచేసింది. వచ్చే వారం నుంచి ఎండలు మరింత ముదురుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రస్తుతానికి తటస్థంగా ఉందని... రాబోయే రోజుల్లో అది ఏ స్థితికి వస్తుందో చూడాలని అంటున్నారు. అది కూడా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే ఎండలు ఇంకా మండుతాయని విశ్లేషిస్తున్నారు. వచ్చే నెల నుంచే వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ నుంచి అవి మరింత పుంజుకుంటాయని అంటున్నారు.
ఆగస్టు, సెప్టెంబర్‌లలో ఎల్‌నినో?
గత రెండేళ్లుగా రుతుపవనాలను బలహీనం చేసిన ఎల్‌నినో ఈ ఏడాది కూడా దుష్ప్రభావం చూపనుందా? అంటే అవునంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వాతావరణ మోడళ్లూ కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయని స్కైమెట్ శాస్త్రవేత్త మహేశ్ ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఈ అంచనాలు ప్రస్తుతానికి మాత్రమేనని, ఈ ఏడాది రుతుపవనాలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం మార్చి చివరినాటికి, లేదంటే ఏప్రిల్ 15 నాటికి మాత్రమే తెలుస్తుందని ఆయన చెప్పారు.