సంచలనం రేపిన వీడియో
తిరువనంతపురం: సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులపై యజమాని విచక్షణారహితంగా దాడిచేసిన వీడియో కలకలం రేపింది. బాధితులు ఉత్తర కేరళలోని హరిపాద్ పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. యజమాని తమను వేధిస్తున్నాడని, కాపాడాలంటూ ఈ వీడియోను కుటుంబ సభ్యులకు పంపారు.
సౌదీ వ్యక్తి చేతిలో లావుపాటి కర్ర పట్టుకుని బాధితులు ముగ్గురినీ కర్కశకంగా కొడుతున్నట్టు దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. యెమెన్ లో ఎలక్ట్రిషీయన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి వారిని సౌదీ అరేబియాకు తీసుకెళ్లారు. అక్కడ ఇటుక బట్టీల్లో పనిచేయాలని వారిని వేధించారు.
ఈ అమానవీయ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాంది స్పందించారు. సౌదీలోని భారత ఎంబసీ, కేరళ సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. రెండు రోజుల్లో బాధితులను కేరళ తీసుకొస్తామని హామీయిచ్చారు. మధ్య ఆసియా దేశాల్లో ఉద్యోగాలతో కేరళవాసులు ఎంతో మంది మోసపోతున్నారు. ప్రమాద పరిస్థితుల్లో చిక్కుకున్నా పేదరికం కారణంగా వెనక్కు రాలేకపోతున్నారు.
వారంలో తిరిగొస్తారు: సుష్మా
బాధితులు వారం రోజుల్లో ఇండియాకు తిరిగి వస్తారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. సౌదీ పోలీసుల దృష్టికి తాము ఈ విషయాన్ని తీసుకెళ్లామని కూడా ఆమె చెప్పారు.