ప్రసూతి సెలవు 24 వారాలకు పెంపు!
న్యూఢిల్లీ: గర్భిణులైన ఉద్యోగులకు ప్రసూతి సెలవును రెట్టింపు చేయాలనే ఆలోచన ఉన్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు. ప్రస్తుతం 12వారాలు ఉన్న సెలవు పరిమితిని 24 వారాలకు పెంచేలా ప్రసూతి ప్రయోజనాల చట్టం-1961కి అవసరమైన సవరణలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన ద్వారా జూలై 16 వరకు 41వేల ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. ఉద్యోగులకు బోనస్ రెట్టింపు చేయటం, ఉద్యోగాలు మారినప్పుడు గ్రాట్యుటీ కోల్పోకుండా గ్రాట్యుటీ పోర్టబుల్ సౌకర్యం కల్పించే ప్రతిపాదనేదీ లేదని కూడా మంత్రి చెప్పారు.