తగ్గింపు ధరలతో కందిపప్పు విక్రయాలు
* గ్రేడ్-1 కందిపప్పు కిలో రూ.160, గ్రేడ్-2 రకం రూ.135
* నేటి నుంచే విక్రయాలు ప్రారంభం, ఒక్కొక్కరికి కేజీ మాత్రమే
సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్ ధరలకన్నా తక్కువ ధరలతో సామాన్య వినియోగదారులకు కందిపప్పును అందించేందుకు దాల్ మిల్లర్లు ముందుకు వచ్చారు. ఇందుకోసం ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. ఈ కేంద్రాలద్వారా గ్రేడ్-1 కందిపప్పు కిలో రూ.160, గ్రేడ్-2 కందిపప్పు కిలో రూ. 135కు విక్రయిస్తామని మిల్లర్లు స్పష్టం చేశారు.
హైదరాబాద్ సహా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ఈ కేంద్రాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ రజత్‌కుమార్ దాల్ మిల్లర్లు, హోల్‌సేలర్లు, ఇతర వ్యాపారులతో తగ్గింపు ధరలపై కందిపప్పు విక్రయాలపై చర్చలు జరిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ధరలక న్నా తక్కువకే సామాన్యులకు విక్రయాలు చేయాలని ఆయన కోరారు. దీనికి మిల్లర్లు అంగీకారం తెలిపారు.
హైదరాబాద్‌లో 10 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా, జిల్లా, మండల కేంద్రాల్లో పౌరసరఫరాల శాఖ సహకారంతో విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రాల్లో ఒక్కొక్కరికి కేవలం కేజీ కందిపప్పును మాత్రమే విక్రయిస్తారు. ఈ విక్రయ కేంద్రాల చిరునామా, తగ్గించిన ధరలపై ఆయా జిల్లాల కలెక్టర్లు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విసృ్తత ప్రచారం కల్పించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.