
టయోటా ‘ప్రాడో’.. కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: టయోటా కంపెనీ లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ మోడల్.. ల్యాండ్ క్రూయిజర్ ప్రాడోలో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధరను రూ.84.87 లక్షలుగా(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) నిర్ణయించామని కంపెనీ డిప్యూటీ ఎండీ, సీవోవో సందీప్ సింగ్ పేర్కొన్నారు. ఈ కారు బుకింగ్స్ గురువారం నుంచే ప్రారంభించామని కంపెనీ తెలిపింది. 3.0 లీటర్ 170 బీహెచ్‌పీ డీ4డీ డీజిల్ ఇంజిన్‌తో కూడిన ఈ కారు ఐదు రంగుల్లో లభ్యమవుతుంది.
ఈ కారులో చుట్టుపక్కల పరిస్థితులను సావకాశంగా పరిశీలించడానికి మానిటర్, టైర్లలో ఎంత ప్రెజర్ ఉందో పర్యవేక్షించే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రాల్ కంట్రోల్(రోడ్డు పరిస్థితి జారుడుగా ఉన్నప్పుడు, సరిగ్గా లేనప్పుడు యాక్సిలేటర్, బ్రేక్‌ల అవసరం లేకుండా స్టీరింగ్‌పై పూర్తిగా డ్రైవర్‌కు నియంత్రణ ఉండే సిస్టమ్), మల్టీ టెర్రైన్ సెలెక్ట్(బురద, ఇసుక, రాళ్లతో ఉన్న రోడ్ మోడ్స్‌ను ఎంపిక చేసుకునే ఫీచర్) వంటి ప్రత్యేకతలున్నాయి. 2004లో మార్కెట్లోకి తెచ్చిన ఈ కారుకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని సందీప్ పేర్కొన్నారు.