
’కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే..’
హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళుతుందన్న వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు ధీటైన నాయకుడిగా ఎవరిని నిలపాలనేదానిపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎవరికివారు ‘నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని..’అని ప్రకటించుకుంటున్న తరుణంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శనివారం గాంధీభవన లో విలేకరులతో మాట్లాడిన ఆయన సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై క్లారిటీ ఇచ్చారు.
’పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నవారే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీ. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డే నాయకత్వంలోనే 2019 ఎన్నికల్లో పోరాడతాం. కాబట్టి మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే’ అని మల్లు రవి చెప్పారు. ఆశా వర్కర్లు , విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాలు చేసినప్పుడు పట్టించుకోని కేసీఆర్.. ఎన్నికలు దగ్గర పడుతున్నందునే వాళ్లందరినీ పిలిపించుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆశా వర్కర్ల వేతనం రూ.6,000 కాదు, రూ.9,000కు పెంచాలని మల్లు డిమాండ్ చేశారు.