హిజ్రాలకూ పోలీసు ఉద్యోగాలు
చెన్నై: హిజ్రాలకు పోలీస్‌శాఖలో ఉద్యోగాలు కల్పించడం ద్వారా తమిళనాడు ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలవనుంది. పోలీస్‌శాఖలో 13,137 ఖాళీలను భర్తీ చేయాలని జయలలిత ప్రభుత్వం భావిస్తోంది. ఆ క్రమంలో పోలీసు ఉద్యోగాలకు హిజ్రాలకు కూడా అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తుల్లో హిజ్రా అని స్పష్టం చేసిన వారిని మహిళా విభాగ దరఖాస్తుల జాబితాలో చేర్చి అందుకు అనుగుణమైన పరీక్షలు, పరిశీలనలు నిర్వహించనున్నారు. ఈ తరహా నిర్ణయం దేశంలోనే తొలిసారి కావటం విశేషం.
2013లో పోలీసు ఉద్యోగానికి శాంతి అనే హిజ్రా దరఖాస్తు చేసుకుంది. అనంతరం రాత, శరీర దారుఢ్య పరీక్షతోపాటు ఇంటర్వ్యూలోనూ ఉత్తీర్ణురాలై పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుంది. అయితే కొన్ని నెలలు ఉద్యోగం చేసిన తరువాత సహజంగా నిర్వహించిన వైద్య పరీక్షలో శాంతి హిజ్రా అని తేలడంతో ఉద్యోగం నుంచి తొలగించారు.
దీంతో సదరు శాంతి మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. పాఠశాలల్లో తనను మహిళగా గుర్తించారని... అలాగే మహిళా క్రీడాకారిణిగా తమిళనాడు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లోనూ పాల్గొన్నట్లు శాంతి హైకోర్టుకు తెలిపింది. దీంతో శాంతిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు పోలీసుశాఖను ఆదేశించింది. కాగా శాంతి మళ్లీ పోలీసుశాఖలో చేరలేదు.
శాంతి విషయంలో హైకోర్టు తీర్పును ఆదర్శంగా తీసుకున్న హిజ్రాలు పోలీసుశాఖలో ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపడంతో ప్రభుత్వం కూడా అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు ఆ శాఖలోని విశ్వసనీయవర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మరో నెలరోజుల్లో వెలువడే అవకాశం ఉందని సమాచారం. డిసెంబర్‌లోగా హిజ్రాల నియామకం పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.