దేశంలో అతిపెద్ద పారమిలటరీ దళమైన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అధిపతిగా దిలీప్ త్రివేది శనివారం నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ కేడర్కు చెందిన దిలీప్ త్రివేది 1978 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఇప్పటి వరకు ఆయన సరిహద్దు భద్రత దళంలో ప్రత్యేక డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వర్తించారు. గతంలో కేంద్రంలో పలు కీలక పదవులను దిలీప్ త్రివేది ఎంతో సమర్థవంతగా నిర్వహించారు.
కాగా ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన ప్రణయ్ సహయి జులై 31న పదవి విరమణ పొందారు. దీంతో ఎన్ఎస్జీ అధిపతి అరవింద్ రాజన్కు నాటి నుంచి సీఆర్పీఎఫ్ అధిపతిగా తాత్కలిక బాధ్యతలను హోం మంత్రిత్వశాఖ అప్పగించింది. దేశవ్యాప్తంగా సీఆర్పీఎఫ్ దళంలో దాదాపు 3 లక్షలకు పైగా సిబ్బంది పని చేస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నక్సల్స్ చర్యలను నిరోధించేందుకు సీఆర్పీఎఫ్ సమర్థవంతంగా పని చేస్తున్న సంగతి తెలిసిందే.