
హిల్లరీపై ట్రంప్ తాజా వ్యాఖ్యలు..
వాషింగ్టన్: కూతురితో డేటింగ్ వ్యాఖ్యలు, సరోగసీ వైఫ్ వార్తల దుమారం, మాజీ అధ్యక్షుడి వివాహేతర సంబంధాలు, అవినీతి, లైంగిక ఆరోపణలు.. ఒక్కటేమిటి, 2016 ఎన్నికలు.. అమెరికా చరిత్రలోనే అథమస్థాయి ప్రచారపర్వంగా నిలిచిపోయాయి. ‘గొప్ప ప్రజాస్వామ్యదేశమని చెప్పుకునే అమెరికాలోనూ నాయకులు ఇలాగే ఉంటారా?’ అని ప్రపంచం ముక్కున వేలేసుకుంది. చివరికి తెంపరి వ్యాఖ్యలు చేసిన ట్రంపే విజయం సాధించారు. ప్రచారపర్వంలో తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను అన్నమాట అనకుండా ఘాటు విమర్శలతో దాడిచేసిన ట్రంప్ ఇప్పుడు స్వరం పూర్తిగా మార్చేశారు.
శుక్రవారం ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. హిల్లరీ క్లింటన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. హిల్లరీ గొప్ప పోరాటయోధురాలని, ఉదార స్వభావి అని ఆకాశానికి ఎత్తేశారు. ‘ఆమె చాలా తెలివైన నాయకురాలు. అదే సమయంలో ధృఢంగానూ వ్యవహరిస్తారు. ఫలితాలు వెలువడిన రోజు ఆమె నుంచి ఫోన్ కాల్ అందుకోవడం మర్చిపోలేని విషయం. నాకు తెలుసు.. ఆ కాల్ ఆమెకు ఓ కఠిన పరీక్ష’అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థ పేర్కొంది. (హిల్లరీపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు)
అయితే ఫోన్ చేసిన సమయంలోనూ హిల్లరీ ఏమంత సున్నితంగా వ్యవహరించలేదని, కేవలం అభినందలను చెప్పి, ‘వెల్ డన్ డోనాల్డ్’ అన్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. హిల్లకీ కాల్ కు సమాధానమిస్తూ ధన్యవాదాలతోపాటు ‘మీరు టఫ్ కాంపిటీటర్’అని అన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. నవంబర్ 9న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో విజయఢంకా మోగించిన డోనాల్డ్ ట్రంప్.. జనవరి 20న అమెరికా 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.