
తిండికి, మతానికి ఎందుకు ముడి పెడతారు?
న్యూఢిల్లీ : తినే తిండికి, మతానికి ఎందుకు ముడి పెడతారో నాకు అర్థంకావడం లేదు. నేను హిందువునైనా ఆవు మాంసం తింటాను. ఆవు మాంసం తినే వారికి భక్తి ఉండదనా... తినని వారికి దేవుడంటే భక్తి ఉంటుందనా అర్థం అంటూ బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవధను మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. ఇకమీదట రాష్ట్రంలో ఎక్కడైనా ఆవు మాంసాన్ని విక్రయించిన లేదా కలిగి ఉన్నా వాళ్లకు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 50 వేల రూపాయల జరిమానా విధించనున్నారు.
అందుకు సంబంధించిన చట్టానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఏడాది మార్చి నెల మొదటి వారంలో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిలందే. గోవధ నిషేధంపై మహారాష్ట్ర మార్గంలోనే హర్యానా అనుసరించింది. హర్యానా రాష్ట్రంలో గోవధ చేస్తే మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 30 వేల నుంచి రూ. లక్ష జరిమాన విధించనుంది. అందుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం గత సోమవారం హర్యానా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో రిషికపూర్ ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని పై విధంగా వెల్లడించారు.