పెనువిషాదంలో చిన్ని ఆశ..
- నుజ్జునుజ్జయిన బోగీ నుంచి సురక్షితంగా బయటపడిన ఇద్దరు చిన్నారులు
ఆదివారం తెల్లవారుజామున పట్టాలు తప్పి పెనువిషాదానికి కారణమైన ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో ఒక చిన్ని ఆశ ఇది. వందకుపైగా మందిని పొట్టనబెట్టుకున్న ఈ విషాదఘటనలో ఇద్దరు చిన్నారులు మృత్యుంజయులై సురక్షితంగా బయటపడ్డారు. నుజ్జునుజ్జయిన ఎస్-3 బోగీ నుంచి ఆరేళ్లు, ఏడేళ్లు వయస్సున్న ఇద్దరు చిన్నారులను సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ఈ బోగీలో చిన్నారుల పక్కన ఉన్న ఓ మహిళ మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఈ చిన్నారుల తల్లి అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇద్దరు చిన్నారులు సురక్షితంగా దక్కడంతో పట్టాలు తప్పి నుజ్జునుజ్జయిన బోగీల్లో మరింతమంది బతికి ఉండవచ్చునన్న ఆశ సహాయ సిబ్బందిలో మెదులుతోంది.
ఈ దుర్ఘటనలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. చాలా ఓపికగా సహాయక సిబ్బంది బోగీల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నది. తుక్కుతుక్కయిన మరో బోగీలోనూ ఇద్దరు బాలికలు చిక్కుకున్నారని, వారిని సురక్షితంగా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని, బోగీల్లో మనుషులు బతికి ఉంటారన్న అంచనాతో క్రేన్‌లు ఉపయోగించడం లేదని ఎన్డీఆర్‌ఎఫ్ కమాండెంట్ ఏకే సింగ్ తెలిపారు.