హార్ధిక్ తో ఫొటో దిగినందుకు...
అహ్మదాబాద్: అత్యుత్సాహంతో గుజరాత్ లో ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ సస్పెన్షన్ కు గురయ్యారు. పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని పోరాటం చేస్తున్న హార్ధిక్ పటేల్ తో పోలీస్ స్టేషన్ లో ఫొటో దిగినందుకు వారిపై వేటు పడింది. దేశద్రోహం కేసులో అరెస్టైన హార్దిక్ తో ఫొటోలు దిగినందుకు మహేంద్ర సిన్హ్, జవాన్ సిన్హ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
సూరత్ క్రైమ్ బ్రాంచ్(సీబీ) కార్యాలయంలో కూర్చుని ఉన్న హార్థిక్ పక్కన నిలబడి వీరిద్దరూ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో ఉన్నతాధికారులు ఈ చర్య తీసుకున్నారు. ఫొటో తీసిన కంప్యూటర్ ఆపరేటర్ అరుణ్ దలెను కూడా సస్పెండ్ చేశారు. నిందితుడితో పోలీస్ స్టేషన్ లో ఫొటోలు దిగడం నేరమని డిప్యూటీ పోలీసు కమిషనర్(క్రైమ్) దీపన్ భద్రన్ తెలిపారు.