పారిస్: పారిస్‌లో శుక్రవారం రాత్రి మారణహోమం సృష్టించిన ఉగ్రవాదుల్లో ఇంకా ఇద్దరు తప్పించుకుని తిరుగుతున్నారని పారిస్ అధికారులు ప్రకటించారు. వారి కోసం ఫ్రాన్స్‌తో పాటు, యూరప్ దేశాల్లోనూ గాలింపు ముమ్మరం చేశారు. దీంతో యూరప్ దేశాలన్నీ అప్రమత్తయ్యాయి. పారిస్ ఉగ్రదాడిలో 129 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 350 మంది వరకూ గాయపడ్డం తెలిసిందే. ఆ దాడిలో ఎనిమిది మంది పాల్గొన్నారని.. ఏడుగురు ఉగ్రవాదులు మానవబాంబులుగా ఆత్మాహుతి చేసుకోగా, మరొక ఉగ్రవాది తప్పించుకుని పొరుగున ఉన్న బెల్జియం లోకి పారిపోయాడని ఫ్రాన్స్ పోలీసులు మర్నాడు తెలిపారు. అయితే.. తాజాగా మరొక వ్యక్తీ ఈ దాడుల్లో పాల్గొన్నట్లు వీడియోల ద్వారా గుర్తించినట్లు తెలిపారు.
బెల్జియంలో జన్మించి ఫ్రాన్స్‌లో స్థిరపడిన సలాహ్ అబ్దెస్లామ్ తన సోదరుడు బ్రహీమ్‌తో కలిసి దాడుల్లో పాల్గొన్నాడని.. వీరు బ్లాక్ సీట్ కారులో ప్రయాణిస్తూ కొన్ని బార్లు, రెస్టారెంట్లపై కాల్పులు జరిపారని వివరించారు. అయితే.. వారి కారులో మూడో వ్యక్తి కూడా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. దాడుల అనంతరం సలాహ్ పరారవగా.. అతడి సోదరుడు బ్రహీమ్ బౌల్వార్డ్ ఓల్టేర్ వద్ద బాంబులతో పేల్చుకుని చనిపోయాడు. మూడో వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడు. అయితే.. సలాహ్, బ్రహీమ్‌ల మరో సోదరుడైన మొహమద్‌ను ఉగ్రదాడి తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన సోదరుడు సలాహ్‌ను పోలీసులకు లొంగిపోవాల్సిందిగా అతడు విజ్ఞప్తి చేశాడు. జర్మనీలోని హనోవర్‌లో బుధవారం జర్మనీ-నెదర్లాండ్స్ మధ్య జరగాల్సిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను బాంబు దాడి అనుమానాలతో రద్దు చేశారు.
అప్పుడు జరిమానా విధించి వదిలేశాం..!
సలాహ్ అబ్దెస్లామ్ (26) ఈ ఏడాది ఫిబ్రవరిలో డ్రగ్స్‌తో నెదర్లాండ్స్‌లో పోలీసులకు చిక్కాడు. అతడికి 70 యూరోలు జరిమానా విధించి వదిలివేశారు. సలాహ్, అతడి సోదరుడు, మరొకడు బెల్జియంలో రిజిస్టరయిన ఒక కారులో వెళ్తుండగా నెదర్లాండ్స్‌లోని గోరిన్‌చెమ్ వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేశారని.. అతడి వద్ద కొంత గంజాయి ఉండటంతో జరిమానా విధించామని ఆ దేశ పోలీసులు తెలిపారు. అప్పటికి అతడిపై కేసులు లేనందున ఇంకా లోతుగా దర్యాప్తు చేయలేదన్నారు.
పరారీలో ఇద్దరు ఉగ్రవాదులు..యూరప్ అప్రమత్తం
Published Thu, Nov 19 2015 3:33 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM
Advertisement