లండన్: యూరోపియనేతరులకు ఇక యూకేలో ఉద్యోగం, చదువు కల కాబోతోందా?. అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినవస్తున్నాయి. యూకే ప్రభుత్వం ఇమిగ్రేషన్ లో తీసుకురానున్న మార్పులు దీన్నే సూచిస్తున్నాయి కూడా. ఇమిగ్రేషన్ లో మార్పులకు సంబంధించిన ప్లాన్స్ ను యూకే మంగళవారం బయటపెట్టింది.
బర్మింగ్ హామ్ లో జరిగిన కన్జర్వేటివ్ పార్టీ వార్షిక సమావేశంలో మాట్లాడిన ఆ దేశ హోం శాఖ సెక్రటరీ అంబర్ రడ్ వలసలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈయూ నుంచి బయటకు రావడం వ్యూహంలో ఒక భాగమైతే, వలసలను తగ్గించడం మరో భాగమని అన్నారు.
దేశ కంపెనీలు ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసుకోకుండా ఉండే విధంగా నిబంధనలను కఠినతరం చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. దీంతో భారత్ లాంటి దేశాల నుంచి ప్రొఫెషనల్స్ ను ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవడం అక్కడి కంపెనీలకు కష్టమే. బ్రిటిష్ ప్రజలు చేయగలిగే ఉద్యోగాలను వేరే వారికి వెళ్లకుండా ఉండే విధంగా చేయడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.
తమ వాళ్లను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుకోలేకపోతే ప్రపంచంలో తాము గెలుపును చూడలేమని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి యూకేలో నివసించడానికి ఇమిగ్రేషన్ అనుమతి లేకుండా ఉన్నవారిని జైలుకు పంపిస్తామని తెలిపారు. కారును నడపడానికి కూడా కచ్చితంగా ఇమిగ్రేషన్ డిపార్ట్ మెంట్ అనుమతి ఉండాలని తెలిపారు.
దీంతో యూకేలో విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్ధుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కోర్సును బట్టి యూనివర్సిటీ ఇమిగ్రేషన్ నిబంధనలను మార్చనున్నట్లు ఆమె తెలిపారు. అయితే, ఈ పద్దతిని పరిశీలించాల్సివుందని చెప్పారు. నిబంధనలపై యూనివర్సిటీలతో చర్చలు జరిపిన తర్వాత మాత్రమే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. యూకే చట్టాలను ఉల్లంఘిచిన వారిని తిరిగి ఈయూకు పంపే నిబంధనలను సులభతరం చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం చట్టాన్ని సవరిస్తామని వెల్లడించారు.
యూకేలో చదువు, ఉద్యోగం కలే!
Published Tue, Oct 4 2016 10:02 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
Advertisement