immigration rules
-
నేటి నుంచి కొత్త ‘గ్రీన్ కార్డ్ రూల్’
వాషింగ్టన్: అమెరికాలో ఫుడ్ స్టాంప్స్ తదితర ప్రభుత్వ ప్రయోజనాలు పొందే చట్టబద్ధ వలసదారులకు గ్రీన్‌కార్డ్ నిరాకరించేందుకు ఉద్దేశించిన నిబంధన సోమవారం నుంచి అమలులోకి రానుంది. ఈ నిబంధన హెచ్1 బీ వీసాపై అమెరికాలో ఉంటూ, గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ నిబంధనపై ఇచ్చిన స్టే ఆర్డర్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం ఎత్తివేసింది. దీంతో ‘అమెరికా సమాజంలోకి కొత్తగా వచ్చేవారు స్వయం సవృద్ధులై ఉండాలని, పన్ను చెల్లింపుదారులైన అమెరికన్లపై వారు ఆధారపడకూడదనే సూత్రం అమల్లోకి వస్తుంది’ అని అమెరికా తెలిపింది. కాగా తాజా నిబంధన ప్రకారం.. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు తాము ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేదని, భవిష్యత్తులోనూ వాటిని ఆశించబోమని, ఈ దేశానికి తాము భారం కాబోమని ధ్రువీకరించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు భవిష్యత్తులోనైనా ఆ ప్రయోజనాలు పొందే అవకాశముందని అధికారులు భావిస్తే.. వారికి గ్రీన్ కార్డ్‌ను నిరాకరించే అవకాశం కూడా ఉంది. ఏటా దాదాపు 5.4 లక్షల మంది గ్రీన్కార్డ్కు అప్లై చేసుకుంటారు. అయితే, వలసదారుల్లో కొందరికి మాత్రమే.. వారి ఇమిగ్రేషన్ స్టేటస్‌ను బట్టి మెడిక్ ఎయిడ్, ఫుడ్ స్టాంప్స్, హౌసింగ్ వోచర్స్.. తదితర ప్రభుత్వ ప్రయోజనాలు పొందే అర్హత ఉంటుంది. (గ్రీన్‌కార్డు కోసం 2.27 లక్షల మంది భారతీయులు వెయిటింగ్) -
అత్యవసరమైతే తప్ప అమెరికా వెళ్లకండి
అబుజా: అమెరికా తెస్తున్న కొత్త వీసాల నిబంధనల ప్రభావం అన్ని దేశాలపైనా పడుతోంది. అత్యవసరమైతే తప్ప అమెరికా పర్యటనను వాయిదా వేసుకోవాలని నైజీరియా ప్రభుత్వం ఆ దేశ ప్రజలను కోరింది. వలసదారులకు సంబంధించి తీసుకొస్తున్న మార్పులు, నిబంధనలపై స్పష్టత వచ్చేంతవరకు అమెరికా పర్యటనలను వాయిదా వేసుకోవడం మంచిదని నైజీరియా అధ్యక్షుడి విదేశీ వ్యవహారాల సలహాదారు అబైక్ ఎరేవా సోమవారం ఒక ప్రకటనలో ఆ దేశ ప్రజలకు సూచించారు. అమెరికాలో ప్రవేశించడానికి మల్టిపుల్ వీసాలు ఉన్నప్పటికీ గడిచిన కొద్ది వారాలగా అమెరికా విమానాశ్రయాల్లో ఇమిగ్రేషన్ అధికారులు అనేక మందికి వీసా ఇవ్వకుండా నైజీరియన్లను వెనక్కి తిప్పి పంపిస్తున్నారని, అందుకు ఇమిగ్రేషన్ అధికారులు ఎలాంటి కారణాలను వివరించడం లేదని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఇమిగ్రేషన్ విధానంపై స్పష్టత వచ్చేంతవరకు పర్యటనలను వాయిదా వేసుకోవడం మంచిదని ఆమె సూచించారు. ప్రస్తుతం అమెరికాలో 2.1 మిలియన్ల ఆఫ్రికా దేశస్తులు గణాంకాలు చెబుతున్నాయి. -
యూకేలో చదువు, ఉద్యోగం కలే!
లండన్: యూరోపియనేతరులకు ఇక యూకేలో ఉద్యోగం, చదువు కల కాబోతోందా?. అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినవస్తున్నాయి. యూకే ప్రభుత్వం ఇమిగ్రేషన్ లో తీసుకురానున్న మార్పులు దీన్నే సూచిస్తున్నాయి కూడా. ఇమిగ్రేషన్ లో మార్పులకు సంబంధించిన ప్లాన్స్ ను యూకే మంగళవారం బయటపెట్టింది. బర్మింగ్ హామ్ లో జరిగిన కన్జర్వేటివ్ పార్టీ వార్షిక సమావేశంలో మాట్లాడిన ఆ దేశ హోం శాఖ సెక్రటరీ అంబర్ రడ్ వలసలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈయూ నుంచి బయటకు రావడం వ్యూహంలో ఒక భాగమైతే, వలసలను తగ్గించడం మరో భాగమని అన్నారు. దేశ కంపెనీలు ఇతర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసుకోకుండా ఉండే విధంగా నిబంధనలను కఠినతరం చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. దీంతో భారత్ లాంటి దేశాల నుంచి ప్రొఫెషనల్స్ ను ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవడం అక్కడి కంపెనీలకు కష్టమే. బ్రిటిష్ ప్రజలు చేయగలిగే ఉద్యోగాలను వేరే వారికి వెళ్లకుండా ఉండే విధంగా చేయడానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. తమ వాళ్లను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుకోలేకపోతే ప్రపంచంలో తాము గెలుపును చూడలేమని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి యూకేలో నివసించడానికి ఇమిగ్రేషన్ అనుమతి లేకుండా ఉన్నవారిని జైలుకు పంపిస్తామని తెలిపారు. కారును నడపడానికి కూడా కచ్చితంగా ఇమిగ్రేషన్ డిపార్ట్ మెంట్ అనుమతి ఉండాలని తెలిపారు. దీంతో యూకేలో విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్ధుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కోర్సును బట్టి యూనివర్సిటీ ఇమిగ్రేషన్ నిబంధనలను మార్చనున్నట్లు ఆమె తెలిపారు. అయితే, ఈ పద్దతిని పరిశీలించాల్సివుందని చెప్పారు. నిబంధనలపై యూనివర్సిటీలతో చర్చలు జరిపిన తర్వాత మాత్రమే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. యూకే చట్టాలను ఉల్లంఘిచిన వారిని తిరిగి ఈయూకు పంపే నిబంధనలను సులభతరం చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం చట్టాన్ని సవరిస్తామని వెల్లడించారు.