
హైదరాబాద్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు
చైతన్యపురి: హైదరాబాద్ లో ఆకతాయిలు బీభత్సం సృష్టించారు. ఇళ్ల ముందు పార్క్ చేసి ఉన్న కార్లపై గుర్తుతెలియని దుండగులు దాడులకు దిగారు. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ పరిధిలోని కోదండరాం నగర్, పీ అండ్ టీ కాలనీ, శారదానగర్‌లలో ఇళ్ల ముందు పార్క్ చేసి ఉన్న కార్లపై శనివారం గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. దీంతో 18 కార్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దుండగులు ఎవరనే విషయాన్ని నిర్ధరించుకోవడానికి కాలనీలలోని సీసీ టీవీల ఫుటేజిని పరీక్షిస్తున్నారు. పోలీసు పెట్రోలింగ్ లేకపోవడంతోనే ఆకతాయిలు దాడులు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ గతంలో కూడా ఆటోలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే.