ఆ ముగ్గురికి ట్రిపుల్ తలాక్ ఖాయం: ఒవైసీ
ఆ ముగ్గురికి ట్రిపుల్ తలాక్ ఖాయం: ఒవైసీ
Published Sat, Feb 4 2017 4:04 PM | Last Updated on Mon, Aug 20 2018 5:36 PM
సమాజ్‌వాదీ, కాంగ్రెస్, బీఎస్పీలకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ట్రిపుల్ తలాక్ ఇవ్వడం ఖాయమని మజ్లిస్ పార్టీ జాతీయాధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బీజేపీని కూడా ఆయన వదల్లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇద్దరూ నాణేనికి రెండు వైపుల లాంటివాళ్లన్నారు. మోదీ, అఖిలేష్ ఇద్దరి మధ్య పెద్దగా తేడా ఏమీ లేదని, అభివృద్ధి పేరుతో వీళ్లిద్దరూ ప్రజలను మోసం చేశారని అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక టీవీ చానల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒవైసీ మాట్లాడారు.
ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్, రాజీవ్ గాంధీలను ముస్లింలు తమ నాయకులుగా అంగీకరించారని, కానీ వాళ్లు ముస్లింలను మోసం చేశారని అసదుద్దీన్ అన్నారు. వాళ్ల పిరికితనం, అన్యాయం, నిర్లక్ష్యం వల్లనే తాను ఈరోజు మీ ముందుకు రావాల్సి వచ్చిందంటూ ఓటర్లతో చెప్పారు. ఉగ్రవాద కేసుల్లో ఇరుక్కున్న ముస్లిం యువకులను విడిపిస్తామని సమాజ్‌వాదీ పార్టీ హామీ ఇచ్చింది గానీ, ఆ విషయంలో ఏమీ చేయలేదన్నారు. ట్రిపుల్ తలాక్ గురించే మోదీ ప్రభుత్వం ఎందుకు పట్టుకుని వేలాడుతోందని ఆయన ప్రశ్నించారు. వాళ్లు జకియా జాఫ్రీ గురించి, దాద్రీ ఘటనలో మరణించిన అఖ్లాక్ తల్లి గురించి ఎందుకు మాట్లాడరని అడిగారు.
Advertisement