అగ్రరాజ్యంలో సంక్షోభం!
Published Thu, Oct 3 2013 12:22 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
అందరికీ శాస్త్రం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా అమెరికా ఇప్పుడు అంతర్గత సంక్షోభంతో సతమతమవుతోంది. అధికార డెమొక్రాట్లకూ, విపక్ష రిపబ్లికన్‌లకూ తలెత్తిన విభేదాలు చూస్తుండగానే ముదిరి చివరకు ప్రభుత్వాన్ని మూతపెట్టే పరిస్థితికి చేర్చాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ధికవ్యవస్థ ఇప్పుడు ‘వేతనాలివ్వలేం. ఉద్యోగానికి రావొద్దు’ అని 8లక్షలమంది ఉద్యోగులకు వర్తమానం పంపింది. పరిస్థితి చక్కబడ్డాక కూడా ఈ కాలానికి వారికి వేతనాలు రావు. మరో 10 లక్షల మంది సిబ్బందికి ‘మళ్లీ చెప్పేవరకూ వేతనం లేకుండా పనిచేయాల’ని కోరింది. కేవలం అత్యవసర సేవలందించే విభాగాలు తప్ప మిగిలిన కార్యాలయాలను మూసేశారు. సొంత నిధులతో నడిచే పోస్టల్ విభాగం, విద్యాసంస్థలు, రక్షణ రంగానికి చెందిన విభాగాలు మాత్రమే పనిచేస్తున్నాయి. కొన్నాళ్లక్రితం అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆర్ధిక వ్యవస్థను నిర్వహించాల్సిన తీరుపై మన దేశానికి పాఠాలు చెప్పారు. ‘మలి దశ సంస్కరణలు ఇంకా ప్రారంభించరేమిట’ంటూ తొందరపెట్టారు. మీరు ఫలానా దోవన నడవకపోతే మునిగిపోతారని బెదిరించారు. ఇంతగా చెప్పిన అగ్రరాజ్యమే సొంతింటిని చక్కదిద్దుకోవడంలో నిండా విఫలమైందని వర్తమాన అమెరికా పరిణామాలు చాటి చెబుతున్నాయి.
మన దేశంలో అధికార, విపక్షాలమధ్య ఎన్ని విభేదాలున్నా బడ్జెట్ ఆమోదం వంటి కీలకాంశాల్లో పట్టుదలకు పోవు. దేశాన్ని సంక్షోభంలోకి నెట్టవు. కానీ, అమెరికాలో సరిగ్గా ఇందుకు విరుద్ధంగా జరిగింది. ఈ ప్రతిష్టంభనకు ‘ఒబామా కేర్’గా ప్రసిద్ధిచెందిన ఆరోగ్య బీమా మూలకారణం. నిజానికి ఇప్పుడు ఆమోదించాల్సిన బడ్జెట్‌కూ, ఈ బీమా పథకానికి నేరుగా సంబంధం లేదు. కానీ, బడ్జెట్‌ను ఆమోదించాలంటే దీన్ని ఆపేయాల్సిందేనని రిపబ్లికన్లు బేరంపెట్టారు. కనీసం ఈ పథకానికి పరిమితులు విధించేలా చేయాలన్నది వారి వ్యూహం. దేశంలోని దాదాపు 4 కోట్లమంది పేద జనానికి ఎలాంటి ఆపదవచ్చినా బాసటగా నిలిచే ఈ పథకం... మనదగ్గరున్న ‘ఆరోగ్యశ్రీ’ని పోలివుంటుంది. మూడున్నరేళ్ల క్రితం ఒబామా దీన్ని ప్రారంభించినప్పుడే రిపబ్లికన్లు వమ్ముచేయడానికి చూశారు. కోట్లాదిమంది పన్నులద్వారా చెల్లించే సొమ్మును ఇలా ‘వృథా’ చేయడమేమిటని ప్రశ్నించారు. రిపబ్లికన్లే కాదు...తన పార్టీ అయిన డెమొక్రాట్లనుంచి కూడా ఒబామా ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. స్థోమతలేనివారు చావడమే మేలన్నది వీరందరి వాదనల సారాంశం. ఒబామా రెండోసారి అధ్యక్ష పదవిని గెల్చుకోవడానికి ఈ పథకం ఎంతగానో దోహదపడింది. 14 రాష్ట్రాలు ఈ పథకానికి వ్యతిరేకంగా కోర్టులకెక్కాయి. చివరకు సుప్రీంకోర్టు గత ఏడాది జూన్‌లో ఇచ్చిన మెజారిటీ తీర్పుతో దీని అమలుకు మార్గం సుగమం అయింది. అటు తర్వాత కూడా రిపబ్లికన్లు వదిలిపెట్టలేదు. వివిధ రూపాల్లో దీన్ని మోకాలడ్డటానికి విశ్వప్రయత్నంచేశారు. సరిగ్గా అమెరికాలో సంక్షోభం ప్రారంభమైన మంగళవారం రోజే ఆరోగ్యబీమా పథకం అమలు ప్రారంభమైంది. వేలాదిమంది పౌరులు ఈ పథకంలో చేరడానికి ఉత్సాహపడటంతో వెబ్‌సైట్లు క్రాష్ అయ్యాయి.
అయితే, బడ్జెట్ ఆమోదంలో ప్రతిష్టంభనను ఎదుర్కోవడం, ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలేయడం అమెరికాలో ఇది మొదటిసారేమీ కాదు. 1976 తర్వాత ఇలా 17 సందర్భాల్లో ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. పాలక, ప్రతిపక్షాలమధ్య విభేదాలు తలెత్తి 1995-96లో 21 రోజులపాటు ప్రభుత్వ కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. అప్పటి పరిస్థితి వేరు...ఇప్పటి అమెరికా వేరు. 2008లో తలెత్తిన ఆర్ధికమాంద్యంనుంచి ఆ దేశం ఇప్పటికీ కోలుకోలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని అక్కడి పాలకులు చెబుతున్నారు గానీ అది అర్ధసత్యమే. అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఇలాంటి సమయంలో దేశంపై మరో సంక్షోభాన్ని రుద్దడం ఎంతవరకూ సమంజసమన్నది ఆర్ధిక నిపుణుల ప్రశ్న.
అమెరికా ఆర్ధిక సంవత్సరం ఏటా అక్టోబర్ 1న మొదలై మరుసటి ఏడాది సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. సరిగ్గా గత నెల 20న ఇరు పార్టీలమధ్యా తలెత్తిన విభేదాలు క్రమేపీ ముదిరి చివరకు రిపబ్లికన్ల ఆధిపత్యం ఉండే ప్రతినిధుల సభలో బడ్జెట్‌ను తిరస్కరించేదాకా వచ్చింది. ఆరోగ్యబీమాకు నిధులు సమకూర్చడాన్ని తోసిపుచ్చుతూ ప్రతినిధుల సభ తీర్మానం ఆమోదించగా, డెమొక్రాట్ల ఆధిక్యం ఉన్న సెనేట్ అందుకు విరుద్ధమైన తీర్మానం చేసింది. ఇలా ఎవరికి వారు పట్టుదలకు పోయి రెండు సభల సంయుక్త సమావేశం జరగాలని చివరిరోజైన సోమవారం ప్రతినిధుల సభ తీర్మానించేదాకా వెళ్లింది. తీరా ఆ సమయానికల్లా సెనేట్ వాయిదా పడిపోయింది.
ప్రభుత్వాల నుంచి జవాబుదారీ తనాన్ని డిమాండ్ చేయడం, అందుకోసమని అవసరమైతే పాలనను స్తంభింపజేసే నిర్ణయాలు తీసుకోవడం తమ హక్కని రిపబ్లికన్లు సమర్ధించుకుంటున్నారు. ఇది ఉగ్రవాద చర్య అనిపించుకుంటుందని, ప్రభుత్వంపై తుపాకి గురిపెట్టి ఒప్పించే ప్రయత్నమని డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు. ఈ పరిణామం ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పెద్దగా లేకపోయినా అమెరికన్ మార్కెట్లపై వెనువెంటనే కనబడింది. కానీ, ఇది ఎక్కువ రోజులు కొనసాగితే అందరికీ ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే, అమెరికాకు ఇంతకుమించిన పెను సంక్షోభం పొంచివుంది. ఇప్పుడున్న 16.7లక్షల కోట్ల డాలర్ల రుణ పరిమితిని మరింత పెంచుతూ ఈ నెల 17లోగా అమెరికన్ కాంగ్రెస్ తీర్మానించకపోతే ఆ దేశం దివాలా తీసి అంతర్జాతీయ మార్కెట్‌లో డిఫాల్టర్‌గా నిలిచిపోతుంది. ఆ సమయంలో కూడా ఆరోగ్యబీమాను అడ్డంపెట్టి ఒబామా సర్కారును దారికితేవాలన్న వ్యూహంలో రిపబ్లికన్లు ఉన్నారు. అగ్రరాజ్యంగా చెలామణి అవుతున్న అమెరికా సొంతింటిని చక్కబెట్టుకోలేనంత అధ్వాన్నస్థితిలో ఉన్నదంటే అది అవమానకరమని, అలాంటి చర్యలవల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు కూడా ముప్పువాటిల్లుతుందని ఇరుపక్షాలూ గ్రహించుకోవాలి. వివేకంతో మెలగాలి.
Advertisement
Advertisement