భారతీయ విద్యార్థులకు డిగ్రీతో పాటు గ్రీన్ కార్డు...
వాషింగ్టన్ : ఓ వైపు ఇమ్మిగ్రేషన్ పాలసీపై గందరగోళ వాతావరణం సృష్టిస్తున్న అమెరికా.. మరోవైపు ప్రతిభావంతులైన భారతీయులను తమకు కావాలంటోంది. ఇనోవేషన్, రీసెర్చ్ లో ఆధిపత్య స్థానాన్ని కొనసాగించడానికి అమెరికాకు భారతీయ ప్రతిభ అవసరమని ఓ టాప్ అమెరికన్ సెనేటర్ అన్నారు. అంతేకాక భారతీయ విద్యార్థులకు టెక్ డిగ్రీతో పాటు గ్రీన్ కార్డు ఇవ్వాలని పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పడిన ట్రంప్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ పాలసీపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అయితే తమకు భారతీయ ప్రతిభ కావాలని, ఇనోవేషన్, రీసెర్చ్ లో టాప్ లో ఉండాలంటే భారతీయులతో ఉద్యోగాలను భర్తిచేసుకోవాల్సి ఉంటుందని నార్త్ కొరోలినా సెనేటర్ థాం టిల్లిస్ చెప్పారు. ఇండియన్ అమెరికన్లు ఏర్పాటుచేసిన ఓ ఈవెంట్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతీయ ప్రతిభను తిరిగి సంపాదించుకునే క్రమంలో ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చే సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్ విద్యార్థులకు డిగ్రీలతో పాటు గ్రీన్ కార్డు ఇవ్వాలనే ప్రతిపాదనకు ఆయన మొగ్గుచూపారు.
తమ ఆర్థికాభివృద్ధిని మూడు నుంచి నాలుగు శాతానికి పెరిగేలా చేయడానికి హైటెక్ జాబ్స్, అడ్వాన్స్డ్ డిగ్రీలు, అడ్వాన్స్డ్ అనాలిటిక్స్, సైన్సు అండ్ రీసెర్చ్ ల్లో మానవ వనరులు అవసరమన్నారు. ఈ ఉద్యోగాలు వినూత్న దేశంగా అమెరికా ఉనికి మరింత చాటడానికి, పోటీ ప్రపంచంలో అమెరికాను అగ్రస్థానంలో కొనసాగించేందుకు ఎంతో అవసరమని చెప్పారు. సెనేట్ జ్యుడిషియరీ కమిటీకి సభ్యుడైన టిల్లిస్, వీసాలకు సంబంధించిన ఇమిగ్రేషన్ పాలసీలో సవరణలకు ఎంతో కీలకపాత్ర పోషించారు. అయితే భారతీయు ఐటీ కంపెనీలకు, నిపుణులకు ఎంతో ఆందోళన కలిగిస్తూ, హెచ్-1బీ వీసా ప్రక్రియలో అదనపు మార్పులు తీసుకురావాలని అమెరికా కాంగ్రెస్ లో ప్రతిపాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆందోళన నేపథ్యంలో థాం టిల్లిస్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.