హల్దీరామ్ ఉత్పత్తులపై అమెరికా నిషేధం
హల్దీరామ్ ఉత్పత్తుల్లో క్రిమిసంహారక మందులు మోతాదుకు మించి ఉంటున్నాయని, కొన్నింటిలో ఫంగస్‌తో పాటు టైఫాయిడ్ కారక సాల్మోనెల్లా క్రిములు ఉంటున్నాయని పేర్కొంటూ.. ఆ ఉత్పత్తులను అమెరికా నిషేధించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించి హల్దీరామ్ ఉత్పత్తులన్నింటినీ త క్షణమే తనిఖీ చేయాలని 'ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్' (ఎఫ్డీఏ)ను ఆదేశించింది. నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు ముందుగా స్పందించిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఉంది. నాగపూర్‌కు చెందిన హల్దీరామ్ కంపెనీ రాష్ట్రంలోనే ఉన్నందున, వాటి ఉత్పత్తుల వినియోగం కూడా ఎక్కువే ఉన్నందున ఈ అంశంపై తక్షణం స్పందించాల్సిన అవసరం ఉందని, శాంపుల్స్‌ను సేకరించి వీలైనంత త్వరగా పరీక్షించాలని కోరుతూ ఎఫ్డీఏ కమిషనర్ హర్షదీప్ కాంబ్లీకి రాష్ట్ర ఎఫ్డీఏ సహాయ మంత్రి విద్యాఠాకూర్ లేఖ రాశారు.
హల్దీరామ్ ఫుడ్ కంపెనీని నాగపూర్‌లో 1937లో గంగాబైసేంజీ అగర్వాల్ ఏర్పాటుచేశారు. తొలుత కుటుంబ పరిశ్రమగా ఉన్న ఈ కంపెనీ వారసుల విభజనతో ఇతర శాఖలు వెలిశాయి. ఇప్పటికీ నాగపూర్ కాకుండా ఢిల్లీ, కోల్‌కతాలో మాత్రమే కుటుంబ సభ్యుల బ్రాంచులు ఉన్నాయి. కొన్ని నగరాల్లో ఇతర వ్యాపారస్థులకు ఫ్రాంచైజీలు ఇచ్చారు. హల్దీరామ్ ఉత్పత్తులు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేయడంతో పాటు అమెరికా, కెనడా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, థాయ్‌లాండ్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.