నెలన్నర కనిష్టానికి స్టాక్ సూచీలు
మార్కెట్ అప్‌డేట్
పోటెత్తుతున్న అమ్మకాలు
కొనసాగుతున్న లాభాల స్వీకరణ
అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుండటంతో వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు-బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు శుక్రవారం ఒకటిన్నర నెల కనిస్టానికి పడిపోయాయి. సెన్సెక్స్ 209 పాయింట్లు నష్టపోయి 28,261 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయి 8,571 పాయింట్ల వద్ద ముగిశాయి. రియల్టీ, విద్యుత్, ఎఫ్‌ఎంసీజీ, కన్సూమర్ డ్యూరబుల్స్, వాహన, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లూ పతనబాటలోనే సాగాయి.
రూపాయి పతనంతో ఐటీ షేర్ల జోరు
అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటంతో స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైందని, ఇదే పోకడ చివరి వరకూ కొనసాగిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్( రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. రూపాయి పతనం కూడా ప్రభావం చూపిందని వివరించారు. రూపాయి పతనం వల్ల ఐటీ షేర్లు పెరిగాయని, అయితే ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని సూచీలు నష్టాల పాలయ్యాయని పేర్కొన్నారు. గనుల బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినప్పటికీ, స్టాక్ మార్కెట్ పట్టంచుకోలేదని, మంచి వార్తలు వచ్చినప్పుడల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారని ఆల్టామౌంట్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డెరైక్టర్ ప్రకాశ్ దివాన్ చెప్పారు. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ మొత్తం 475 పాయింట్లు(1.65 శాతం) నష్టపోయింది. ఈ వారంలో 242 పాయింట్లు నష్టపోయింది. ఇలా స్టాక్ మార్కెట్ వరుసగా రెండో వారం కూడా నష్టాల్లోనే ముగిసింది. 2,117 షేర్లు నష్టాల్లో, 752 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,664 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.20,175 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.3,27,529 కోట్లుగా నమోదైంది
ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ పేరు మార్పు
ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్) పేరు ఇకపై మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజీగా (ఎంఎస్‌ఎక్స్‌ఐ) మారనుంది. ఇందుకు సంబంధించి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి అనుమతి లభించినట్లు ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ తెలిపింది. సంస్థకు కొత్త రూపునిచ్చేందుకు పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
ఐనాక్స్ విండ్ ఐపీవోకు 18 రెట్లు సబ్‌స్క్రిప్షన్
పవన విద్యుదుత్పత్తి సంస్థ ఐనాక్స్ విండ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) 18 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం కంపెనీ మొత్తం 2.32 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. ఐపీవో ముగింపు రోజైన శుక్రవారం నాటికి మొత్తం 43.08 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. షేరు ఒక్కింటికి రూ. 315-325 ధరల శ్రేణితో ఐనాక్స్ విండ్ పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. పునరుత్పాదక వనరులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రాధాన్యమిస్తుండటం ఐనాక్స్ విండ్‌కు లాభించిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దాదాపు రూ. 700 కోట్లు సమీకరించేందుకు ఐనాక్స్ విండ్ ఐపీవోకి వచ్చింది. 2013 జూన్ తర్వాత వచ్చిన ఐపీవోల్లో ఇదే అత్యధికంగా నిల్చింది.