యువతీ యువకులపై పోలీసుల దాడి
ముంబై: యువతీ యువకులపై దాడి చేసి ముంబై పోలీసులు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆంధేరీ సబర్బన్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం రాత్రి యువతీ యువకులపై పోలీసులు చేయి చేసుకున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. అయితే దాడి చేశామన్న ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. మద్యం మత్తులో ఉన్న వీరిద్దరినీ విడదీసేందుకు మాత్రమే తాము ప్రయత్నించామని చెప్పారు.
'మద్యం మత్తులో ఆంధేరీ మెట్రో స్టేషన్ సమీపంలోని రోడ్డుపై పరస్పరం గొడవ పడుతున్న వీరిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చాం. స్టేషన్ లో కూడా ఒకరినొకరు తోసుకునేందుకు ప్రయత్నించగా మేము అడ్డుకున్నాం. యువతిపై భౌతికదాడి చేసేందుకు యువకుడు ప్రయత్నించగా అడ్డుకునేందుకు యత్నించాం. దీన్నే వీడియో తీసి దాడి చేశామనడం సబబు కాద'ని ఆంధేరీ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్ పెక్టర్ నందకుమార్ ధూమాల్ అన్నారు.
యువతీ యువకులపై కేసు నమోదు చేయలేదని, హెచ్చరించి పంపేశామని తెలిపారు. వారి తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి విషయం చెప్పామన్నారు. యువకుడు బైకుల్లా ప్రాంతంలో, యువతి నలాసొపరా సబర్బన్ లో నివసిస్తోందన్నారు. వీరిద్దరూ మలాద్ ప్రాంతంలో కాల్ సెంటర్ లో పనిచేస్తున్నారని వెల్లడించారు.