
హైదరాబాద్‌లో వీడియోకాన్ మొబైల్స్ ప్లాంట్
రూ.60 కోట్లతో యూనిట్
ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభం
వీడియోకాన్ మొబైల్స్ సీవోవో జెరాల్డ్ పెరీరా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీ సంస్థ వీడియోకాన్.. మొబైల్స్ అసెంబ్లింగ్ యూనిట్‌ను హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తోంది. శంషాబాద్ వద్ద కంపెనీకి చెందిన ఉపకరణాల తయారీ ప్లాంటు వద్ద రూ.60 కోట్లతో ఈ యూనిట్‌ను నెలకొల్పుతోంది. తొలుత నెలకు 5 లక్షల ఫోన్లను అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. దశలవారీగా ఈ సామర్థ్యాన్ని పెంచనున్నారు. శంషాబాద్ ప్లాంటులో ఏడాదిలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని వీడియోకాన్ మొబైల్స్ సీవోవో జెరాల్డ్ పెరీరా సాక్షి బిజినెస్ బ్యూరోకు శుక్రవారం తెలిపారు. ఫీచర్ ఫోన్లతోపాటు స్మార్ట్‌ఫోన్లు కూడా ఈ యూనిట్‌లో తయారవుతాయని వివరించారు. వీటితోపాటు డిమాండ్‌నుబట్టి ట్యాబ్లెట్ పీసీలను సైతం అసెంబుల్ చేస్తామని వెల్లడించారు.
వాటా పెంచుకుంటాం..: దేశవ్యాప్తంగా నెలకు వివిధ బ్రాండ్లవి కలిపి 1.8 కోట్ల ఫోన్లు అమ్ముడవుతున్నాయి. ఇందులో వీడియోకాన్ వాటా 2.5-3 శాతం మధ్య ఉంటుందని జెరాల్డ్ పెరీరా తెలిపారు. ఫీచర్, స్మార్ట్, ట్యాబ్లెట్స్ విభాగంలో ఏ సమయంలోనైనా 30 మోడళ్లను మార్కెట్లో అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. ‘మూడు నాలుగు నెలల కోసారి పాత వాటి స్థానంలో 30 శాతం మోడళ్లు కొత్తవి తీసుకొస్తున్నాం. ఫీచర్ ఫోన్లకు భారత్‌లో ఇంకా డిమాండ్ ఉంది. ఇక స్మార్ట్‌ఫోన్లు సైతం ఊపందుకున్న నేపథ్యంలో వీటిపైనా ప్రత్యేక దృష్టిపెట్టాం. డిసెంబర్‌కల్లా దేశవ్యాప్తంగా మొబైల్స్ మార్కెట్లో 5 శాతం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 10 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నాం’ అని వెల్లడించారు. అవసరమైతే మరిన్ని ప్లాంట్లను పెట్టేందుకు సిద్ధమని చెప్పారు.
నెలకు 30 లక్షల యూనిట్లు..
వీడియోకాన్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్ ప్లాంట్లలో మొబైల్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. తమిళనాడులో కొత్త ప్లాంటు సిద్ధమవుతోంది. ప్రస్తుత సామర్థ్యం నెలకు 10 లక్షల యూనిట్లు. డిసెంబర్‌కల్లా దీన్ని 30 లక్షలకు పెంచాలనేది కంపెనీ లక్ష్యం. కొన్ని విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నామని వీడియోకాన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్స్ హెడ్ షేక్ రఫీ తెలిపారు. శంషాబాద్ వద్ద అనుబంధ యూనిట్లు కూడా రానున్నాయని తెలిపారు.