
విజయా బ్యాంక్ వ్యవ‘సాయం’
డిమాండ్ లేకపోవడంతో కార్పొరేట్ నుంచి రిటైల్‌కు
సంపన్న వర్గాల కోసం
‘విజయ సమృద్ధి’ బ్రాంచీలు
విజయాబ్యాంక్ ఈడీ రామారావు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న డిపాజిట్ల సేకరణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి కరెంట్, సేవింగ్స్ అకౌంట్ (కాసా)పై అధికంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రభుత్వరంగ విజయా బ్యాం క్ ప్రకటించింది. ప్రస్తుతం డిపాజిట్లలో కాసా వాటా కేవలం 18%గా ఉందని, దాన్ని వచ్చే మార్చినాటికి 22 శాతానికి పెంచడంతో పాటు వచ్చే మూడేళ్లలో 30 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విజయా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.ఎస్. రామారావు తెలిపారు. ఇందుకోసం వచ్చే 15 నెలల్లో కొత్తగా 250 శాఖలను ప్రారంభించడంతో పాటు కాసా అకౌంట్స్‌పై ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ఒక్కో శాఖ నుంచి కనీసం 440 తగ్గకుండా మొత్తం ఆరు లక్షల కాసా అకౌంట్స్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం విజయా బ్యాంక్‌కి దేశవ్యాప్తంగా 1,483 శాఖలు ఉండగా మార్చి నాటికి ఈ సంఖ్య 1,500కి చేరనుంది. అధికాదాయవర్గాల వారి కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘విజయ సమృద్ధి’ శాఖను రామారావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ రుణాలకు ఇంకా డిమాండ్ పెరగలేదని, దీంతో ప్రధానంగా వ్యవసాయం, రిటై ల్, ఎస్‌ఎంఈ రంగాలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మొత్తం రుణాల్లో 52%గా ఉన్న కార్పొరేట్ రుణాల వాటాను మూడేళ్లలో 48 శాతానికి తగ్గించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తు తం 14%గా ఉన్న వ్యవసాయం, 33%గా ఉన్న రిటైల్ రుణాలపై అధికంగా దృష్టిపెడుతున్నామన్నారు. ఎన్‌పీఏలు పరిశ్రమ సగటుకంటే తక్కువగానే ఉన్నట్లు తెలి పారు. ఈ ఏడాదిలో వ్యాపారంలో 25% వృద్ధిని అంచనా వేస్తున్నామని, గత మార్చిలో రూ.1.67 లక్షల కోట్లుగా ఉన్న వ్యాపార పరిమాణం 2014 మార్చి నాటికి రూ.2.10 లక్షల కోట్లకు చేర్చాలన్నది లక్ష్యమన్నారు.
‘విజయ సమృద్ధి’ విస్తరణ...
అధికాదాయ వర్గాల కోసం ప్రవేశపెట్టిన ‘విజయ సమృద్ధి’ శాఖలకు మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌సహా ఇప్పటివరకు 4 శాఖలను ప్రారంభించామని, త్వరలో మరో 5 పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ శాఖలో ఖాతా కనీస నిల్వ రూ.3 లక్షలు. అదే కరెంట్ అకౌంట్ అయితే రూ.5 లక్షలు ఉండాలి. ఈ శాఖలో ఖాతాలు కలిగి వున్న వారికి లాకర్ల ఫీజులో 50% తగ్గింపుతో పాటు పలు ప్రోత్సాహకాలు కల్పిస్తోంది.