* ఢిల్లీలో కదం తొక్కిన సమైక్యవాదులు
* కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఎదుట నిరసన
* వందేమాతరం, మా తెలుగుతల్లి గేయాలాపన.. అరెస్టు చేసిన పోలీసులు
* ముట్టడికి ముందు జంతర్‌మంతర్ వద్ద ధర్నా.. రాహుల్ కోసమే విభజనంటూ ఆగ్రహం
* అరెస్టులకు నిరసనగా నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ కేంద్ర కార్యాలయానికి ‘సమైక్యాంధ్ర’ సెగ తాకింది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించవద్దని కోరుతూ విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు, కార్యకర్తలు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నివాసానికి పక్కనే ఉన్న ఏఐసీసీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడించారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా నుంచి ఒక్కసారిగా బయల్దేరి ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుని, మూడు గంటలపాటు ధర్నా చేపట్టి ఢిల్లీ పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. నాటకీయ పరిణామాల మధ్య చివరికి పోలీసులు ఉద్యమకారులందరినీ అరెస్ట్ చేశారు.
విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ‘సేవ్‌ఆంధ్రప్రదేశ్-సేవ్ ఇండియా’కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి 36 బస్సుల్లో శనివారం జఢిల్లీకి తరలివచ్చిన వందలాది సమైక్యవాదులు ఆదివారం ఉదయం తొలుత జంతర్‌మంతర్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలు, మహాసభ సభ్యులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు 20 బస్సుల్లో బయలుదేరి ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం గేటు ఎదుట ఉన్న బారికేడ్లను పక్కకు తోసేసిన ఉద్యమకారులు, కార్యాలయం ప్రధాన గేటును దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడున్న కొద్దిమంది పోలీసులు ఉద్యమకారులను తీవ్రంగా ప్రతిఘటిస్తూ రోడ్డు వరకు తోసుకొచ్చారు. పోలీసుల తోపులాటలో విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి రవితేజ సొమ్మసిల్లి పడిపోయారు. ఈలోపు భారీగా పోలీసు సిబ్బంది ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు.
పోలీసుల చర్యలకు బెదరకుండా నిరసన
పోలీసుల చర్యను ఖండిస్తూ ఉద్యమకారులు రోడ్డుపై బైఠాయించారు. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ..’, ‘వందేమాతరం.. గీతాలను ఆలపిస్తూ.. తమ నిరసనను కొనసాగించారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని స్వచ్ఛందంగా అరెస్టు అయితే ఎలాంటి చర్యలు ఉండవని హిందీ, తెలుగు భాషల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యమకారులతో పలుమార్లు చర్చలు జరిపారు.
శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తాము న్యాయం జరిగేవరకు ఎట్టిపరిస్థితుల్లో ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ విశాలాంధ్ర మహసభ ప్రతినిధులు, కార్యకర్తలు తేల్చిచెప్పారు. సాయంత్రం 6 గంటల సమయంలో ఆందోళ నకారులందరినీ పోలీసులు అరెస్టు చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అరెస్టయినవారిలో విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి, కార్యదర్శి రవితేజ, సమతా పార్టీ అధ్యక్షుడు వాసిరెడ్డి కృష్ణారావు తదితరులున్నారు. అరెస్టులకు నిరసనగా సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్టు మహాసభ, జేఏసీ నాయకులు ప్రకటించారు.
రాహుల్‌ను పీఎం చేసేందుకే విభజన..
రాహుల్‌గాంధీని ప్రధానిని చే యడానికి అవసరమైన ఎంపీ సీట్ల కోసమే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు పూనుకున్నారని విశాలాంధ్ర మహాసభ నేతలు ఆరోపించారు. ఏఐసీసీ కార్యాలయం ముట్టడికి ముందు విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కళాకారులు తమ పాటలతో రాష్ట్రం సమైక్యంగా ఉంటే కలిగే ప్రయోజనాలు వివరించారు.
ఏఐసీసీ కార్యాలయం ముట్టడి
Published Mon, Nov 11 2013 3:20 AM | Last Updated on Fri, Aug 17 2018 6:00 PM
Advertisement
Advertisement