డీ విటమిన్ లోపంతో క్యాన్సర్
సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల మానవ జీవన శైలి ఎంతో మారింది. ఎండావానల్లో ఆడుకునే పిల్లలు ఇంటి పట్టునే ఉండిపోతున్నారు. సరదాగా ఆడుకోవాలనిపిస్తే వీడియో గేమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇక ఉద్యోగస్థులకు పగలు రాత్రయింది, రాత్రి పగలయింది. దీనివల్ల అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా డీ విటమిన్ లోపం వల్ల చాలా తీవ్రమైన జబ్బులు వస్తాయన్న విషయం ఇటీవలనే తేలింది. డీ విటమిన్ లోపం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహ వ్యాధి, మానసిక రుగ్మతలు, రకరకాల కీళ్ల నొప్పులు వస్తాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. వీటి వివరాలను అమెరికా క్లినికల్ ఆంకాలజీ జర్నల్‌లో వివరంగా ప్రచురించారు. రక్త పరీక్ష ద్వారా డీ విటమిన్ లోపాన్ని కనుగొనవచ్చు. సప్లిమెంట్లు వాడడం వల్ల ఈ లోపం వల్ల కలిగే అనర్థాల నుంచి తాత్కాలికంగా సులభంగానే బయడపడవచ్చు. కానీ సహజసిద్ధంగానే.. అంటే ఎండ ద్వారానే డీ విటమిన్‌ను సమకూర్చుకోవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.
మానవ జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగానే భారత్‌లాంటి దేశాల్లో డీ విటమిన్ లోపం ఎక్కువగా పెరిగిపోతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ అవడం వల్ల శరీరానికి ప్రకతిసిద్ధంగా డీ విటమిన్ లభిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఎండపొడకు కనీసం అరగంటైనా బాడీ ఎక్స్‌పోజ్ అవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. రాత్రి వేళల్లో ఉద్యోగాలు చేస్తూ పొద్దెక్కేవరకు నిద్రలేవని వారు, వద్ధాప్యం కారణంగా ఇంటిలోపలే ఉండిపోయేవారు చేపలు తినడం, డీ విటమిన్ కలిగిన మాంసకృత్తులు, పండ్లు తీసుకోవడం ఉత్తమ మార్గమని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వైద్యులు సూచిస్తున్నారు.