
ఆమెను నగ్నంగా షూట్ చేయాలనుకున్నా
ప్రముఖ పెర్ఫ్యూమ్ పరిశోధకురాలు మోనికా ఘర్డే హత్యకేసులో సంచలన వాస్తవాలు బయట పడుతున్నాయి. ఆమెను హత్యచేశానని పోలీసుల విచారణలో అంగీకరించిన సెక్యూరిటీ గార్డు రాజ్‌కుమార్ సింగ్ పలు వాస్తవాలు వెల్లడించాడు. ఆమెను బ్లాక్‌మెయిల్ చేసేందుకు నగ్నంగా చిత్రీకరించాలనుకున్నట్లు చెప్పాడు. అయితే మోనికపై అత్యాచారం చేశాడా లేదా అన్న విషయాన్ని తెలుసుకోడానికి పోలీసులు అతడిని ఇంకా ప్రశ్నిస్తున్నారు. పంజాబ్‌లోని భటిండాకు చెందిన రాజ్‌కుమార్ (21) గతంలో సప్నా రాజ్ వ్యాలీలో వాచ్‌మన్‌గా పనిచేసేవాడు. అక్కడే మోనిక మృతదేహం లభించింది. ఆమె ఏటీఎం కార్డును ఉపయోగించి బెంగళూరులో డబ్బులు డ్రా చేసినట్లు తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బెంగళూరులో రాజ్‌కుమార్‌ను అరెస్టుచేసి, ట్రాన్సిట్ వారంటు మీద గోవాకు తీసుకొచ్చారు.
బెంగళూరులో పోలీసులు విచారించినప్పుడే రాజ్‌కుమార్ పలు విషయాలు వెల్లడించాడు. ముందుగానే ఇంటి ఆనుపానులు తెలిసి ఉండటంతో వెనకవైపు ఫెన్సింగ్ దూకి కాంపౌండ్‌లోకి ప్రవేశించాడు. ఆమె ఇంట్లో దోపిడీ చేయాలని వచ్చాడు. ప్లాట్‌లోకి ప్రవేశించగానే కత్తి చూపించి బెదిరించి, మాట్లాడకుండా ఉండాలని చెప్పాడు. తర్వాత ఆమె చేతులు కట్టేసి, ఏటీఎం కార్డు తీసుకుని.. పిన్ నెంబరు కూడా బలవంతంగా అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ఆమె దుస్తులు విప్పి సెల్‌ఫోన్‌లో షూట్ చేయాలనుకున్నానని, ఆ చిత్రం ఆధారంగా తాను ఆమెను బెదిరించాలనుకున్నానని చెప్పాడు. అయితే నిజంగా అలా షూట్ చేశాడో లేదో మాత్రం ఇంకా తెలియలేదు. మోనిక ముక్కు, నోరు మూసేసి ఊపరిడాకుండా చేసి చంపేసినట్లు తెలిపాడు. తొలుత ఆమె స్పృహతప్పి ఉంటుందని భావించానన్నాడు. ఆమెను చంపేసిన తర్వాత వంటగదిలోకి వెళ్లి.. రెండు కోడిగుడ్లు ఉడికించి, వాటిని తిన్నాడు. ఆమె లేస్తుందేమో అని కాసేపు భయపడ్డాడు. కానీ అప్పటికీ ఇంకా లేవకపోవడంతో తట్టి చూసి.. చనిపోయిందని తెలుసుకుని అక్కడినుంచి పారిపోయాడు.