టీ బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తా: చిరంజీవి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన అనివార్యమైతే పార్లమెంట్‌లో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా సవరణలు ప్రతిపాదిస్తానని కేంద్ర పర్యాటక శాఖ సహాయ(స్వతంత్ర) మంత్రి చిరంజీవి చెప్పారు. బుధవారమిక్కడ ప్రవాస భారతీయ దివస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన పలు టీవీ చానళ్ల ప్రతినిధులతో మాట్లాడారు. ‘తెలంగాణ బిల్లు ప్రస్తుత రూపాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. నా లక్ష్యం సమైక్యాంధ్రే. విభజన తప్పనిసరైతే.. బిల్లు పార్లమెంటులో చర్చకొస్తే.. కొన్ని సవరణలు ప్రతిపాదిస్తా. ప్రధానంగా రెండు సవరణలు కోరుతాను. ఒకటి.. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి.
రెండోది.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలి’ అని వివరించారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగితేనే మంచిదన్నారు. ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరించే ఆలోచనేదీ తనకు లేదని.. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న అప్పటి పీఆర్పీ ఎమ్మెల్యేలెవరూ బయటకు వెళ్లరని చిరంజీవి చెప్పారు. తమ రాజకీయ భవితపై వారు ఆందోళనతో ఉన్నారని అంగీకరించారు.