ఘనంగా ఉగాది ఉత్సవాలు
సాక్షి, న్యూఢిల్లీ: శ్రీజయనామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని ఆంధ్రా అసోసియేషన్ శనివారం ఏపీ భవన్‌లోని గురజాడ హాలులో సాహితీచర్చ, కవి సమ్మేళనం నిర్వహించింది. రెండు రోజుల ఉగాది ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు కార్యక్రమాలను ప్రారంభించిన వ్యాఖ్యాత పి.యం.కె. గాంధీ తెలుగుబాష ప్రాధాన్యం గురించి తెలియజేశారు. ప్రధానవక్తగా పాల్గొన్న రచయిత ముదిగొండ శివప్రాసాద్ తెలుగు క్యాలెండర్ ప్రాముఖ్యతను వివరించారు.
మూడువేల సంవత్సరాల చరిత్రగల తెలుగు భాషను కాపాడుకోవాలని ఆయన హితవు పలికారు. కమలాకర రాజేశ్వరి, డాక్టర్ కమలాదేవి, పున్నంగి కుసుమ, లక్ష్మి, వామనకుమార్, సంపత్‌కుమార్ తదితరులు తమ కవితలు వినిపించారు. కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి రమాకాంత్ ముఖ్యఅతిథిగా విచ్చేయగా, అసోసియేషన్ ట్రస్టీ డాక్టర్ కె.జి.రావు అధ్యక్షత వహించారు. ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.మణినాయుడు, ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, ఇతర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.
ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం మింట్‌రోడ్డు ఎంసీడీ సివిక్ సెంటర్‌లోని కేదార్‌నాథ్ సహానీ ఆడిటోరియంలో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి వితరణ, సాంస్కతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. పెండ్యాల సత్యనారాయణ శర్మ పంచాంగ పఠనం చేస్తారు. వనశ్రీ,రామారావు దంపతుల శిష్యురాలు రెడ్డి లక్ష్మి కూచిపూడి నృత్యప్రదర్శనతోపాటు సినీ, టీవీ కళాకారుల హాస్యవల్లరి, సినీ గాయకుల సంగీత విభావరి ఉంటుందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.