నిధుల కేటాయింపులు ఘనం.. విడుదల నామమాత్రం
సాక్షి, హైదరాబాద్: మైనారిటీల సంక్షేమం కొడిగట్టింది. బడ్జెట్‌లో మైనారిటీలకు రూ.1,104 కోట్లను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం .. గడిచిన ఐదు నెలల్లో కేవలం రూ.199 కోట్లను మాత్రమే విదిల్చింది. అందులో ఖర్చు చేసింది రూ.81 కోట్లు మాత్రమే. మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఫీజులు, స్కాలర్‌షిప్పుల రియింబర్స్‌మెంట్, షాదీ ముబారక్, బ్యాంకు లింకేజీ రుణాల సబ్సిడీల కోసం లబ్ధిదారులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు.
ప్రభుత్వం అరకొరగా విడుదల చేస్తున్న నిధులను సైతం మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు వడ్డీల కోసం బ్యాం కుల్లో నిల్వ ఉంచుతున్నట్లు ఆరోపణలున్నాయి. గతేడాది బడ్జెట్‌లో రూ.1,030 కోట్లను కేటాయిస్తే, అందులో రూ.453 కోట్లను ప్రభుత్వం విడుదల చేయగా రూ. 271 కోట్లే ఖర్చయ్యాయి. ఈ నేపథ్యంలో 2015-16లో సంక్షేమ రంగానికి కేటాయింపులకు అనుగుణంగా పూర్తిస్థాయిలో నిధులను ఖర్చు చేస్తామని ప్రభుత్వం అసెంబ్లీలో సైతం ప్రకటన చేసింది.
గతేడాది తరహాలోనే నిధుల కేటాయింపులు, వ్యయం ఉండటంతో మైనారిటీల సంక్షేమం విషయంలో ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారమంతా వట్టిదేనని విమర్శలు వస్తున్నాయి. రంజాన్ పర్వదినా న్ని అధికారికంగా నిర్వహించి మైనారిటీలను ఆకర్షించేం దుకు ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధి, మైనారిటీల పథకాల అమలులో కనిపించడం లేదని మైనారిటీ మేధావులు పేర్కొంటున్నారు.
ప్రచార ఆర్భాటమే..: రాష్ట్ర బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమం, అభివృద్ధి కోసం నిధుల కేటాయింపులో పాలకులు చూపుతున్న చిత్తశుద్ధి నిధులవిడుదలపై మాత్రం కనబర్చుతున్న దాఖలాలు కానరావడం లేదు. గత నాలుగేళ్లలో నిధుల కేటాయింపులు, విడుదల, వినియోగం పాలకుల నిర్లక్ష్యానికి దర్పణం పడుతోంది.
మైనారిటీల సం‘క్షామం’!
Published Mon, Aug 31 2015 3:13 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM
Advertisement