
'అందరూ అంటున్నదే మాట్లాడారు'
న్యూఢిల్లీ: మత అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. ఎన్డీఏ ప్రభుత్వంలో జరుగుతున్న వాటి గురించి అందరూ అంటున్నదే ఆమిర్ మాట్లాడారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు.
'అగ్రహీరోల్లో ఒకరైన ఆమిర్ ఖాన్.. బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో తమ అసహనంపై గళం విప్పారు. మోదీ పాలన గురించి ప్రపంచమంతా, దేశమంతా చెప్పుకుంటున్నదే ఆయన చెప్పారు' అని సింఘ్వి తెలిపారు. సోమవారం ఢిల్లీలోని రామ్‌నాథ్ గోయంకా ఎక్స్‌లెన్స్ ఇన్‌జర్నలిజం అవార్డుల ప్రదానోత్సవంలో మత అసహనంపై ఆమిర్ ఖాన్ మాట్లాడారు.
మత అసహనంపై గళం విప్పినంతమాత్రానా ఆమిర్ ఖాన్ ను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడిగా ముద్ర వేయడం తగదన్నారు. ఆయన ఎటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయలేదన్నారు. సినిమాల్లో కాకుండా నిజజీవితంలోనూ ఆమిర్ ఖాన్ సందేశాత్మకంగా వ్యవహరించారని సింఘ్వి ప్రశంసించారు.