ఒబామా సాధించినది ఏమిటి? | What are barrack obama achievements | Sakshi
Sakshi News home page

ఒబామా సాధించినది ఏమిటి?

Published Wed, Jan 11 2017 3:34 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

What are barrack obama achievements

అమెరికా అధ్యక్షపదవి నుంచి దిగిపోతున్న బరాక్‌ ఒబామా మంగళవారం అమెరికా ప్రజలనుద్దేశించి ఆఖరిసారి భావోద్వేగంగా ప్రసంగించిన విషయం తెలిసిందే. మేధావి, మంచి వక్తగా గుర్తింపు పొందిన ఒబామా తన భావోద్వేగ మాటలతో ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తారనే విషయం అందరికి తెల్సిందే. ముఖ్యంగా ఆయన నోబెల్‌ శాంతి బహుమతిని ఆమోదిస్తూ చేసిన ప్రసంగం, చార్లెస్టాన్‌లో క్రైస్తవ కార్యక్రమంలో చేసిన ప్రసంగం చరిత్రలో ఎప్పటికి మిగిలిపోతాయని అమెరికా రాజకీయ, సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. 
 
మార్పు, ఆశ అనే నినాదాలతో ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ఒబామా జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంత మేరకు మార్పు సాధించగలిగారు, ప్రజల ఆశలను ఎంత మేరకు తీర్చగలిగారనే అంశాలపై ఇప్పుడు ఇంటా, బయటా చర్చ జరుగుతోంది. జార్జి బుష్‌ తర్వాత అధికారంలోకి వచ్చిన ఒబామా, అప్ఘానిస్తాన్, ఇరాక్‌ల నుంచి అమెరికా సైనిక బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకొస్తానని, గ్వాటెమాలాలోని సైనిక స్థావరాన్ని మూసేస్తానని హామీ ఇచ్చారు. సైనిక బలగాలను పూర్తిగా వెనక్కి రప్పించలేకపోయారు. గ్వాటెమాలాలోని స్థావరాన్ని మూసివేయలేకపోయారు. కరేబియన్‌ జైలును కూడా ఎత్తివేయలేకపోయారు. దేశీయంగా అన్ని జాతుల వారిని ఏకం చేస్తానని, జాతి విద్వేషాలను నిర్మూలిస్తానని పలుసార్లు ప్రకటించారు. 
 
ఇందులోనూ ఆయన వైఫల్యం చెందారు. ఇటీవలనే ఇద్దరు నల్లజాతీయులను శ్వేతపోలీసులు కాల్చివేయడం వల్ల అమెరికాలో అల్లర్లు కూడా చెలరేగాయి. వ్యక్తిగతంగా జాతి విద్వేషాలకు వ్యతిరేకించే ఒబామా, అన్యాయంగా చనిపోయిన నల్లజాతీయుల కుటుంబాలను పరామర్శించకపోవడంపై కూడా విమర్శలు వచ్చాయి. ప్రజలందరికి ఆరోగ్య సౌకర్యం  కల్పిస్తానంటూ 2010లో ఒబామా తీసుకొచ్చిన హెల్త్‌కేర్‌ పథకం ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఇంటా బయటా, అంటే ఇటు డెమోక్రట్లతో విభేదించి, అటు రిపబ్లికన్లతో గట్టిగా విభేదించి హెల్త్‌కేర్‌ స్కీమ్‌ను తీసుjiరావడంతో ఆ స్కీమ్‌కు ఒబామా హెల్త్‌కేర్‌ అని పేరు కూడా వచ్చింది. ఎంతో చిత్తశుద్ధితో ఆయన ఈ ఆరోగ్య పథకాన్ని తీసుకొచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ పథకం నుంచి పెద్ద ఆరోగ్య బీమా కంపెనీలు ఎప్పుడో తప్పుకున్నాయి. తాను అధికారంలోకి రాగానే ఈ స్కీమ్‌ను ఎత్తివేస్తానన్న అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అప్పుడే ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 
దేశీయంగా, అంతర్జాతీయంగా సౌమ్యుడు, మంచి పాలనాదక్షుడు, మంచి ఫ్యామిలీ మేన్‌ అని పేరు తెచ్చుకున్న ఒబామా ఈ ఎనిమిదేళ్లలో దేశానికి చేసిన గొప్ప మేలేమీ లేదు. కాకపోతే నాటి బుష్‌ కన్నా మంచి పాలన అందించారన్న పేరుతో పాటు తన పాలనలో అవినీతి మరక అంటకుండా దిగిపోవడం కూడా విశేషమే. యూరప్, ఆసియా పసిఫిక్, ఉత్తర అమెరికాలో గతేడాది చివరిలో నిర్వహించిన ఓ సర్వేలో కూడా అమెరికా అధ్యక్షుడిగా ఒబామాను 54 శాతం మంది కోరుకుంటున్నారని ‘ప్యూ’ రిసెర్చ్‌ సెంటర్‌ వెల్లడించడం గమనార్హం. 
 
రెండు గొప్ప విజయాలు
విదేశాంగ విధానంలో బరాక్‌ ఒబామా రాణించలేకపోయారనే విమర్శలు ఉన్నా అంతర్జాతీయంగా రెండు గొప్ప విజయాలు సాధించారు. అందులో ఒకటి ఇరాన్‌తో అణు నియంత్రణ ఒప్పందం కాగా, మరోటి ఆగర్భ శత్రుదేశమైనా క్యూబాతో దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవడం. ఈ కారణంగా ఈ రెండు దేశాలపైనా ఆర్థిక ఆంక్షలను ఎత్తేశారు. మధ్యప్రాచ్యంలో, గల్ఫ్‌లో అమెరికా నిర్వహిస్తున్న సైనిక, వైమానిక స్థావరాలను గత అమెరికా అధ్యక్షులలాగానే ఒబామా కూడా కొనసాగించారు. సిరియా పౌరులపై సైన్యం రసాయనిక దాడులకు దిగినా ఆ దేశాధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ను వెనకేసుకరావడం పట్ల కూడా ఒబామాపై విమర్శలు వెల్లువెత్తాయి.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement