నేను సుందరం ట్యాక్స్ సేవర్ ఫండ్‌లో 2010 డిసెంబర్‌లో రూ.10,500 ఇన్వెస్ట్ చేశాను. ప్రస్తుతం నా పెట్టుబడుల విలువ రూ.9,500గా ఉంది. ఈ ఫండ్‌కు ఈ ఏడాది డిసెంబర్ వరకూ లాకిన్ పీరియడ్ ఉంది. ఈ ఫండ్ నుంచి వైదొలగమంటారా? కొనసాగమంటారా ?
- ఆనంద్, కాకినాడ
ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ అన్నీ ఇటీవల నిరుత్సాహకరమైన పనితీరునే కనబరుస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు, ఇతర ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ స్కీమ్స్‌తో పోల్చితే సుందరం ట్యాక్స్ సేవర్ పనితీరు మరింత అధ్వానంగా ఉంది. ఈ కేటగిరి ఫండ్స్ సగటున 0.91 శాతం క్షీణించగా, ఈ ఫండ్ మాత్రం 2.07 శాతం క్షీణతను నమోదు చేసింది. లాకిన్ పీరియడ్ పూర్తయిన వెంటనే ఈ ఫండ్ నుంచి వైదొలగడం ఉత్తమం.
నేనొక దీర్ఘకాలిక మదుపుదారుడిని. ఇటీవలే ప్రారంభమైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్-వాల్యూ ఫండ్ సిరీస్-1 గురించి వివరాలు కావాలి. నా పెట్టుబడుల్లో కొంత భాగం ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చంటారా?
- క్రిష్టోఫర్, హైదరాబాద్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యు ఫండ్ సిరీస్-1కు రెండు సానుకూలాంశాలున్నాయి. దీని ఫండ్ మేనేజర్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. డిస్కవరీ, డైనమిక్ ఫండ్స్ మంచి రిటర్న్‌లు సాధించడానికి ఈ ఫండ్ మేనేజరే కారణం. ఇక రెండోది ఇది క్లోజ్‌డ్-ఎండ్ స్కీమ్. అంటే ఫండ్ పనితీరు విషయమై ఫండ్ మేనేజర్‌పై పెద్దగా ఒత్తిడి ఉండదు. దీర్ఘకాలిక మదుపుదార్లకు అనువైన ఫండ్ ఇది. ఒపెన్-ఎండ్ స్కీమ్‌ల్లో వేల్యూ ఇన్వెస్టింగ్ నియమాలు పాటించడం కష్టమే. క్లోజ్ ఎండ్ స్కీముల్లో ఈ నియమాలు సునాయాసంగా పాటించవచ్చు. అయితే ఈ ఫండ్‌కు ఉన్న ఒకే ఒక్క ప్రతికూలాంశం ఈ ఫండ్ కాలవ్యవధి మూడేళ్లు ఉండడం. ప్రస్తుతం అండర్ వాల్యూగా, ప్రతికూలంగా ఉన్న షేర్లను గుర్తించడం, వాటి నుంచి మంచి రాబడులు సాధించడం మూడేళ్ల కాలంలో కష్టమే. ఇలాంటి వ్యూహం ద్వారా మంచి రాబడి సాధించాలంటే అంతకంటే ఎక్కువ కాలమే అవసరమవుతుంది.
నేను షేర్లు, ఫండ్స్‌ల్లో 2005-06 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఫండ్స్ నుంచి మంచి రాబడులు వస్తుండగా, షేర్లలో నష్టాలు వస్తున్నాయి. షేర్ల నుంచి వైదొలగి పూర్తిగా మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయమంటారా?
- ప్రదీప్, విశాఖ పట్టణం
మ్యూచువల్ ఫండ్స్ ఏడాదికి 1 నుంచి 2 శాతం వార్షిక వ్యయాలను వసూలు చేస్తాయి. ఈ వ్యయాలున్నప్పటికీ, మీరు షేర్ల కంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారానే మంచి రాబడులు ఆర్జించగలిగారు. ఫండ్ మేనేజర్ల ప్రొఫెషనలిజమే దీనికి కారణం. షేర్ల ఎంపిక చాలా సంక్లిష్టమైనది. విభిన్నమైన రంగాలు, రక రకాల పరిశ్రమలు, కంపెనీ పనితీరు, ప్రమోటర్ల ట్రాక్ రికార్డ్, పోటీ కంపెనీలు... ఇలాంటి ఎన్నో విషయాలు కూలంకషంగా పరిశీలించి షేర్లను ఎంచుకోవాలి. అదే మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనుకోండి. ఇలాంటి విషయాలన్నింటినీ అధ్యయనం చేయడానికి పూర్తి స్థాయి రీసెర్చ్ నిపుణులుంటారు. మీకు చాలినంత సమయం, ఆర్థిక పరిస్థితులను ఆకళింపు చేసుకునే నైపుణ్యముంటే షేర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇవి లేకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడమే సముచితం. ఎవరో చెప్పారని, ఏదో ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం సరైన విధానం కాదు.
హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌లో గత రెండేళ్లుగా రూ. 3 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టాను. కానీ రాబడులు సంతృప్తికరంగా లేవు. నష్టాలొచ్చినా సరే ఈ ఫండ్ నుంచి బైటపడమంటారా? అలాగే కొనసాగమంటారా?
- మహ్మద్ రియాజ్, నిజామాబాద్
మీరు పెట్టుబడి పెట్టింది రెండేళ్లే. ఈ రెండేళ్ల కాలానికి ఈక్విటీ పెట్టుబడుల విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఈక్విటీ మార్కెట్లలో ఆటుపోటులు సంవత్సరాల తరబడి తీవ్రంగా ఉంటాయి. మీకు మంచి రాబడులు రావాలంటే దీర్ఘకాలం నిరీక్షించక తప్పదు. అయితే హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్‌కు సంబంధించిన ఫండ్ మేనేజర్ ఎంపిక చేసిన షేర్ల కారణంగా ఈ ఫండ్ పనితీరు సరిగ్గా లేదు. మీరు ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తంలోంచి 75 శాతం పెట్టుబడులను ఉపసంహరించుకొని, మరో మూడు విభిన్నమైన ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. వీటిని ఆరు నెలల పాటు పెట్టుబడులు పెట్టడం సముచితంగా ఉంటుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు ప్రతీ రోజూ భారీగా ఒడిదుడుకులకు గురవుతున్నాయి. దీని నుంచి ప్రయోజనం పొందడానికే మీ ఇన్వెస్ట్‌మెంట్ కాలాన్ని ఆరు నెలలుగా నిర్దేశించుకోండి.
షేర్లు.. ఫండ్‌లలో ఏవి బెటర్?
Published Mon, Nov 11 2013 1:43 AM | Last Updated on Wed, Sep 19 2018 8:44 PM
Advertisement
Advertisement