కేంద్రానికి 21 కోట్ల షేర్ల జారీ
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రూ.5,681 కోట్ల నిధులు సమీకరించింది. కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా ఈ నిధులు సమీకరించామని ఎస్‌బీఐ తెలిపింది. కేంద్రానికి 21.07 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపాదికన కేటాయించడానికి తమ క్యాపిటల్ రైజింగ్ డైరెక్టర్ల కమిటీ ఆమోదం తెలిపిందని స్టాక్ ఎక్సే్చంజ్‌లకు ఎస్‌బీఐ నివేదించింది. రూ. 1 ముఖ విలువ గల షేర్లను రూ.269.59 ధరకు కేటాయించామని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐకు ప్రభుత్వం అందించనున్న రూ.7,575 కోట్ల పెట్టుబడుల్లో భాగంగా ఈ నిధుల సమీకరణ జరిగింది.
ఇక మిగిలిన రూ.1,894 కోట్ల నిధులు ఈ ఏడాది మార్చి 31 లోగా ఎస్‌బీఐకి అందుతాయని అంచనా. బాసిల్ త్రి నిబంధనల ప్రకారం అంతర్జాతీయ నష్టభయ నిబంధనలకనుగుణంగా మూలధనాన్ని సమకూర్చుకోవడానికి తాజా నిధులు తోడ్పడుతాయి. కాగా గత ఏడాది డిసెంబర్ 31 నాటికి ఎస్‌బీఐలో ప్రభుత్వ వాటా 61.1 శాతంగా ఉంది.పదమూడు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను పటిష్టం చేసేందుకు గాను రూ.22,915 కోట్ల పెట్టుబడులు అందించనున్నామని గత ఏడాది జూలై ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే వీటిల్లో 75 శాతం నిధులను బ్యాంక్‌లకు అందజేసింది.