రూ.21 కోట్ల అద్దె ఎవరు కడతారు..?
సాక్షి, ముంబై: ముంబై బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని ఎంఎంఆర్డీఏ మైదానంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ జోరుగా సాగుతోంది. అయితే కార్యక్రమానికి వినియోగిస్తున్న మైదానం అద్దె విషయమై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అద్దె చెల్లించే ప్రసక్తే లేదని ఎంఎంఆర్డీఏ ఎంఐడీసీ స్పష్టం చేయడంతో మరి రూ.21 కోట్లు ఎవరు కడతారన్నది ప్రశ్నార్థకమైంది.
బీకేసీలో శనివారం నుంచి మేకిన్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. వారం రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి 12 రోజుల ముందు అదీనంలోకి తీసుకుని ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఏర్పాట్లు చేసిన రోజులకు సగం, కార్యక్రమం ముగిసేలోపు మిగతా అద్దె వసూలు చేస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలకు మైదానాన్ని గతంలో ఉచితంగా ఇచ్చేవారు.
ఇటీవల ఓ కార్యక్రమంపై తలెత్తిన వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెమ్మార్డీయే ఈ మైదానాన్ని ఉచితంగా ఇవ్వడం నిలిపేసింది. అయితే ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రం రాయితీ ఇస్తోంది. ఆ ప్రకారం మేకిన్ ఇండియా కార్యక్రమానికి రూ.21 కోట్లు అద్దె చెల్లించాల్సి ఉంటుందని ఎంఐడీసీకి ఎమ్మెమ్మార్డీయే స్పష్టం చేయగా చెల్లించలేమని ఎంఐడీసీ తెలిపింది.
సమావేశమూ ఏర్పాటు చేయలేదు..
మైదానం ఉచితంగా ఇవ్వాల్సి వస్తే నిర్ణయం తీసుకునేందుకు ఎమ్మెమ్మార్డీయే ఓ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తుంది. అయితే మేకిన్ ఇండియా కార్యక్రమానికి అద్దెకు ఇచ్చే ముందు అలాంటి సమావేశం జరగలేదు. దీంతో కార్యక్రమం అద్దె ఎవరు చెల్లిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.