మీకు ఎందుకయ్యా కడుపుమంట!
పంజాబ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా టీవీ షోలలో కొనసాగుతానని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పష్టం చేయడంతో ఆయన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత టీవీ షోలలో పాల్గొనడం ఏమిటని ప్రతిపక్షాల నేతలు ఆయనను విమర్శిస్తున్నారు.
అయితే, ఈ విషయంలో తనపై విమర్శలు చేస్తున్నవారిపై సిద్ధూ ఘాటుగా విరుచుకుపడ్డారు. ‘మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తరహాలో నేనే ఏమైనా బస్సు సర్వీసులను నడిపానా? లేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డానా? కేవలం నెలలో నాలుగు రోజులు.. అది కూడా రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసుకుంటానంటే.. ఎందుకు మీకు కడుపు మండిపోతున్నది’ అని సిద్ధూ ప్రశ్నించారు.
మంత్రి అయిన తర్వాత కూడా సిద్ధూ టీవీ కార్యక్రమాల్లో పాల్గొనాలా, వద్ద అనే అంశం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయ సలహా తీసుకుంటామని పంజాబ్ సీఎం అమరీందర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, సీఎం అమరీందర్ తన బాస్ అని, ఆయన ఆదేశాలు గౌరవిస్తానని, అయినప్పటికీ తాను టీవీ షోలలో పాల్గొనడం మానబోనని సిద్ధూ పేర్కొంటున్నారు. సిద్ధూ ప్రస్తుతం ప్రముఖ రియాలిటీ షో ‘కపిల్ శర్మ కామెడీ నైట్స్’కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.