పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు భగవంత్ మాన్ బుధవారం ప్రమాణం చేశారు. పంజాబ్‌లో ఆప్ ఘన విజయం సాధించడంతో ఆయన సీఎం అయ్యారు. అయితే తాజా ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు హేమాహేమీలను మట్టికరిపించి సంచలనం సృష్టించారు. సామాన్య పౌరులు.. కాంగ్రెస్ సీఎంతో సహా సీనియర్ నాయకులను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించారు!
చన్నీకి ఉగోకే చెక్
పంజాబ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఘోరంగా ఓడిపోవడం అతిపెద్ద సంచలనం. ఆయన ఓడించింది సీనియర్ నాయకుడు కాదు.. సామాన్య యువకుడు. చిన్న మొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్త లాభ్ సింగ్ ఉగోకే అనే యువకుడు బదౌర్ నియోజకవర్గంలో చన్నీపై 34,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఉగోకే తండ్రి డ్రైవర్ కాగా, తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా సేవలు అందిస్తోంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఉగోకేకు హీరో హోండా మోటార్‌సైకిల్ మాత్రమే ఉంది.
డాక్టర్ సాబ్‌కే జై
చమ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి కూడా చన్నీకి ‘ఆప్’చేతిలో చుక్కెదురైంది. వృత్తిరీత్యా వైద్యుడైన 55 ఏళ్ల చరణ్‌జిత్ సింగ్ ఇక్కడ నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ చన్నీకి వ్యతిరేకంగా ఆప్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 12,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయినప్పటికీ నియోజకవర్గాన్ని వదలిపెట్టకుండా, ప్రజల మధ్యే ఉంటూ వారి మన్ననలు పొందారు. ఈసారి 7,942 ఓట్ల తేడాతో చన్నీని ఓడించగలిగారు.
నవజ్యోత్ వర్సెస్ జీవన్ జ్యోత్
ప్రజల దృష్టిని ఆకర్షించిన మరో ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్. పంజాబ్ ఎన్నికల్లో ఇద్దరు ప్రముఖ నాయకులను ఆమె ఓడించారు. అమృత్‌సర్ తూర్పు నుంచి కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బిక్రమ్ మజిథియాలపై 6,750 ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీలో వలంటీర్‌గా చేరి, పార్టీ జిల్లా అర్బన్ అధ్యక్షురాలిగా మారడానికి ముందు.. కౌర్ సామాజిక కార్యకర్తగా చురుగ్గా పనిచేశారు. ‘షీ’అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి మహిళలకు రుతుక్రమ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. శానిటరీ ప్యాడ్‌ల వాడకం, రుతుక్రమ పరిశుభ్రత తెలియజేస్తూ 'ప్యాడ్‌వుమన్'గా ఆమె ప్రాచుర్యం పొందారు. (క్లిక్: సోనియా సీరియస్ ఆదేశాలు.. దిగొచ్చిన సిద్ధూ.. పదవికి గుడ్ బై)
కౌర్ చేతిలో సింగ్లా చిత్తు
సంగ్రూర్‌లో ఆప్ యువనేత నరీందర్ కౌర్ భరాజ్.. సిట్టింగ్ కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాతో పోటీ పడి భారీ విజయాన్ని అందుకున్నారు. సింగ్లాను 36,430 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించి తానేంటో నిరూపించుకున్నారు. కోట్లకు పడగెత్తిన వ్యాపారవేత్త, బీజేపీ అభ్యర్థి అరవింద్ ఖన్నా మూడో స్థానానికి పరిమితమయ్యారు. (క్లిక్: మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం..)
లా గ్రాడ్యుయేట్ అయిన కౌర్ జనవరిలో ఎన్నికల సమయంలో తన తల్లితో కలిసి స్కూటర్‌పై వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అప్పట్లో ఈ వీడియోలో తెగ వైరల్ అయింది. రూ. 24,000 విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నట్టు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ఆమె.. ద్విచక్ర వాహనంపైనే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎవరెంత హేళన చేసినా లెక్కచేయక పోటీలో నిలబడి ఘన విజయం సాధించారు.
బాదల్‌కు జగదీప్ బ్రేక్
శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కంచుకోట జలాలాబాద్‌లో ఆప్ పాగా వేసింది. 2009 నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న బాదల్‌కు ఆప్ అభ్యర్థి జగదీప్ కాంబోజ్ బ్రేక్ వేశారు. కాంగ్రెస్ నాయకుడైన జగదీప్ గతేడాది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. తాజా ఎన్నికల్లో బాదల్‌పై దాదాపు 31,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టిక్కెట్ నిరాకరించడంతో మూడేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడిన కాంబోజ్ 2019 ఉపఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసినా 5,000 ఓట్లకు మించి సాధించలేకపోయారు.
ఈ ఎన్నికల్లో ఆప్ మరో ‘జెయింట్ కిల్లర్’అజిత్‌పాల్ సింగ్ కోహ్లి. అకాలీదళ్ మాజీ నాయకుడైన అజిత్‌పాల్.. పటియాలా నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించాడు. గతంలో మేయర్‌గా పనిచేసిన ఆయన పెద్దగా అంచనాలు లేకుండానే పోటీకి దిగి విజయం సాధించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment