Labh Singh Ugoke
-
అమ్మ స్వీపర్.. కొడుకు ఎంఎల్ఏ..
అది పంజాబ్‌లోని బటిండా ప్రాంతంలోని ఒక ప్రభుత్వ పాఠశాల. ఆ బడిలో ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిల్లలంతా సందడిగా, టీచర్లు బిజీబిజీగా ఉన్నారు. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అప్పుడే అక్కడికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన వ్యక్తి వచ్చారు. అంతా నమస్కారాలు, పూల దండలతో స్వాగతం పలుకుతున్నారు. స్కూలు ఆవరణలో ఒకావిడ తన పనిలో నిమగ్నమై ఉంది. వచ్చిన ప్రముఖుడు ఎవరా అని ఆమె తలెత్తి కూడా చూడకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఆమె ఆ ముఖ్య అతిథిని పట్టించుకోకపోవడానికి కారణం.. ఆ వ్యక్తి ఆమె కొడుకే అవ్వడం. సాధారణంగా ఇటువంటి సీన్లు ఎక్కువగా సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే అక్కడ చూపించే వాటిలో.. పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి కూలిపని చేస్తోన్న తల్లిని దగ్గరకు చేరదీయకపోవడం ఎక్కువగా కనిపిస్తుంటుంది. లభ్ సింగ్ ఉగోకే కానీ ఇక్కడ అలా జరగలేదు. తన కొడుకు ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ తన తల్లి కొన్నేళ్లుగా చేస్తోన్న స్వీపర్ పనిని వదిలేయకుండా కొనసాగిస్తోంది. అందుకు ఆమె కొడుకు కూడా అభ్యంతరం చెప్పకపోవడం తెలపడం విశేషం. ఈ తల్లీ కొడుకులు మరెవరో కాదు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఇటీవల ఎంఎల్ఏగా గెలిచిన లభ్ సింగ్ ఉగోకే, ఆమె తల్లి బల్దేవ్ కౌర్. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు ఎదుర్కొని ఉన్నతస్థాయికి చేరుకున్నాక తమని తాము మరచిపోయి విజయ గర్వంతో ప్రవర్తిస్తుంటారు చాలామంది. కానీ కొందరు ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ తాము ఎక్కడి నుంచి వచ్చామో అది మాత్రం మర్చిపోరు. తమ నిరాడంబరతను కొనసాగిస్తుంటారు. ఈ కోవకు చెందిన వారే బలదేవ్ కౌర్. ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ..మిగతా పార్టీలన్నింటిని పక్కకు నెట్టేసి ఆమ్ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో బదౌర్ నియోజక వర్గంలో పోటీచేసి పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీని ఓడించి లభ్ సింగ్ ఉగోకే గెలిచాడు. ప్రస్తుతం లభ్ సింగ్ ఉగోకే ఎంఎల్ఏ. అయితే ఇతని తల్లి బల్దేవ్ కౌర్ గత ఇరవైఐదేళ్లుగా స్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తోంది. కొడుకు ఎంఎల్ఏ అయినప్పటికీ ఆమె మాత్రం తన ఉద్యోగాన్ని వదులుకోలేదు. ఇటీవల తన తల్లి పనిచేస్తోన్న స్కూలుకు ఎంఎల్ఏగా అధికారిక హోదాలో వచ్చారు. అయినా తల్లీకొడుకులు ఇద్దరూ ఆ విషయంలో ఏమాత్రం ఆత్మన్యూనతకు గురి కాలేదు..ఆ విషయాన్ని సంతోషంగానే స్వీకరించారు. దర్శన్ సింగ్, బల్దేవ్ కౌర్ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో ఒకరు లభ్ సింగ్. నిరుపేద కుటుంబం కావడంతో రెండు గదులున్న చిన్న పూరిల్లే వారి నివాసం. దర్శన్ సింగ్ కూలిపనిచేస్తే, భర్తకు చేదోడుగా బల్దేవ్ కౌర్ స్కూల్లో స్వీపర్‌గా పనిచేసి పిల్లలిద్దరిని కష్టపడి చదివించారు. చదువుకున్న లభ్‌సింగ్ రాజకీయాలవైపు ఆకర్షితుడై పదేళ్ల క్రితం ఆప్‌లో చేరి చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకుని ఎంఎల్ఏగా ఎదిగారు. కొడుకు ఎంఎల్ఏ అయ్యాడని తల్లి అబ్బుర పడిందే తప్ప స్వీపర్ పనిని వదల్లేదు. అయినా ఇప్పటికీ ఈ కుటుంబం రెండు గదులున్న ఇంట్లోనే ఉండడం, ఎప్పుడో కొనుక్కున్న పాత మోటర్ సైకిల్‌నే వాడడం విశేషం. ‘‘మేము బతికేందుకు కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నాం. ఇప్పుడు నా కొడుకు ఎంఎల్ఏ అయ్యాడని నేను 25 ఏళ్లుగా చేస్తోన్న పనిని వదులుకోలేను. అతని పని అతనిదే, నా పని నాదే అని సగర్వంగా చెబుతోంది బల్దేవ్ కౌర్. నాకొడుకు ఇదే స్కూల్లో చదువుకున్నాడు. స్కూలో ఉన్నప్పుడు ఇటు స్కూలుకు, అటు గ్రామానికి అనేక పురస్కారాలు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎంఎల్ఏగా ఎదిగి ఎంతోమందికి మంచి పాలన అందించబోతున్నాడు. మరీ నేను ఎందుకు ఖాళీగా ఉండాలి. నా పనిలో నేను ముందుకు సాగితేనే నాకు ఆనందంగా ఉంటుంది’’ అని కౌర్ చెబుతోంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదే. -
కంచు కోటలు బద్దలు కొట్టారు.. చరిత్ర సృష్టించారు!
పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు భగవంత్ మాన్ బుధవారం ప్రమాణం చేశారు. పంజాబ్‌లో ఆప్ ఘన విజయం సాధించడంతో ఆయన సీఎం అయ్యారు. అయితే తాజా ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు హేమాహేమీలను మట్టికరిపించి సంచలనం సృష్టించారు. సామాన్య పౌరులు.. కాంగ్రెస్ సీఎంతో సహా సీనియర్ నాయకులను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించారు! చన్నీకి ఉగోకే చెక్ పంజాబ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఘోరంగా ఓడిపోవడం అతిపెద్ద సంచలనం. ఆయన ఓడించింది సీనియర్ నాయకుడు కాదు.. సామాన్య యువకుడు. చిన్న మొబైల్ రిపేర్ షాప్ నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్త లాభ్ సింగ్ ఉగోకే అనే యువకుడు బదౌర్ నియోజకవర్గంలో చన్నీపై 34,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఉగోకే తండ్రి డ్రైవర్ కాగా, తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా సేవలు అందిస్తోంది. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఉగోకేకు హీరో హోండా మోటార్‌సైకిల్ మాత్రమే ఉంది. డాక్టర్ సాబ్‌కే జై చమ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి కూడా చన్నీకి ‘ఆప్’చేతిలో చుక్కెదురైంది. వృత్తిరీత్యా వైద్యుడైన 55 ఏళ్ల చరణ్‌జిత్ సింగ్ ఇక్కడ నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ చన్నీకి వ్యతిరేకంగా ఆప్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 12,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయినప్పటికీ నియోజకవర్గాన్ని వదలిపెట్టకుండా, ప్రజల మధ్యే ఉంటూ వారి మన్ననలు పొందారు. ఈసారి 7,942 ఓట్ల తేడాతో చన్నీని ఓడించగలిగారు. నవజ్యోత్ వర్సెస్ జీవన్ జ్యోత్ ప్రజల దృష్టిని ఆకర్షించిన మరో ఆప్ అభ్యర్థి జీవన్ జ్యోత్ కౌర్. పంజాబ్ ఎన్నికల్లో ఇద్దరు ప్రముఖ నాయకులను ఆమె ఓడించారు. అమృత్సర్ తూర్పు నుంచి కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ, శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి బిక్రమ్ మజిథియాలపై 6,750 ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీలో వలంటీర్‌గా చేరి, పార్టీ జిల్లా అర్బన్ అధ్యక్షురాలిగా మారడానికి ముందు.. కౌర్ సామాజిక కార్యకర్తగా చురుగ్గా పనిచేశారు. ‘షీ’అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి మహిళలకు రుతుక్రమ పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. శానిటరీ ప్యాడ్ల వాడకం, రుతుక్రమ పరిశుభ్రత తెలియజేస్తూ 'ప్యాడ్‌వుమన్'గా ఆమె ప్రాచుర్యం పొందారు. (క్లిక్: సోనియా సీరియస్ ఆదేశాలు.. దిగొచ్చిన సిద్ధూ.. పదవికి గుడ్ బై) కౌర్ చేతిలో సింగ్లా చిత్తు సంగ్రూర్‌లో ఆప్ యువనేత నరీందర్ కౌర్ భరాజ్.. సిట్టింగ్ కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాతో పోటీ పడి భారీ విజయాన్ని అందుకున్నారు. సింగ్లాను 36,430 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించి తానేంటో నిరూపించుకున్నారు. కోట్లకు పడగెత్తిన వ్యాపారవేత్త, బీజేపీ అభ్యర్థి అరవింద్ ఖన్నా మూడో స్థానానికి పరిమితమయ్యారు. (క్లిక్: మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం..) లా గ్రాడ్యుయేట్ అయిన కౌర్ జనవరిలో ఎన్నికల సమయంలో తన తల్లితో కలిసి స్కూటర్‌పై వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అప్పట్లో ఈ వీడియోలో తెగ వైరల్ అయింది. రూ. 24,000 విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నట్టు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ఆమె.. ద్విచక్ర వాహనంపైనే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎవరెంత హేళన చేసినా లెక్కచేయక పోటీలో నిలబడి ఘన విజయం సాధించారు. బాదల్‌కు జగదీప్ బ్రేక్ శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ కంచుకోట జలాలాబాద్‌లో ఆప్ పాగా వేసింది. 2009 నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న బాదల్‌కు ఆప్ అభ్యర్థి జగదీప్ కాంబోజ్ బ్రేక్ వేశారు. కాంగ్రెస్ నాయకుడైన జగదీప్ గతేడాది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. తాజా ఎన్నికల్లో బాదల్‌పై దాదాపు 31,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టిక్కెట్ నిరాకరించడంతో మూడేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడిన కాంబోజ్ 2019 ఉపఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసినా 5,000 ఓట్లకు మించి సాధించలేకపోయారు. ఈ ఎన్నికల్లో ఆప్ మరో ‘జెయింట్ కిల్లర్’అజిత్‌పాల్ సింగ్ కోహ్లి. అకాలీదళ్ మాజీ నాయకుడైన అజిత్‌పాల్.. పటియాలా నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించాడు. గతంలో మేయర్‌గా పనిచేసిన ఆయన పెద్దగా అంచనాలు లేకుండానే పోటీకి దిగి విజయం సాధించడం విశేషం. -
సీఎంపై గెలిచి ఎమ్మెల్యే అయిన కొడుకు.. తల్లి మాత్రం స్వీపర్‌గానే.. ఎవరామె..?
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ.. జాతీయ పార్టీలకు షాకిస్తూ భారీ మెజార్టీతో విజయం సాధించింది. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ఈనెల 16వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భదౌర్ నియోజకవర్గం నుంచి సీఎం అభ్యర్థి చరణ్‌జీత్ సింగ్ చన్నీపై ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ పోటీ చేసి 37వేలకు పైగా మెజారిటీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా లాభ్ సింగ్ ఫేమస్ అయ్యాడు. కాగా, తన కొడుకు ఎమ్మెల్యే అయ్యాడని ఊరంతా సంబురాలు జరుపుకుంటుడగా.. ఆయన తల్లి మాత్రం సాదాసీదాగా తన పని తాను చేసుకుంటోంది. ఎమ్మెల్యే లాభ్ సింగ్ తల్లి బల్దేవ్ కౌర్ ప్రభుత్వ పాఠశాలలో కొన్నేళ్లుగా స్వీపర్‌గా పని చేస్తోంది. తన కొడుకు ఎమ్మెల్యే అయినప్పటికీ తాను ఇదే వృత్తిలో కొనసాగుతానని పేర్కొంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. తన కొడుకు ఎన్నికల్లో గెలుస్తాడని మొదటి నుంచి ధీమాగానే ఉన్నట్టు తెలిపింది. రానున్న రోజుల్లో లాభ్ సింగ్ కచ్చితంగా పంజాబ్‌లో మార్పులు తీసుకొస్తాడని చెప్పింది. అతడు అందరికీ వైద్యం, విద్య అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తన కొడుకు ఎమ్మెల్యే అయినా తాను స్వీపర్‌గా పని చేస్తానని స్పష్టం చేసింది. లాభ్ సింగ్ తండ్రి దర్శన్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా తన కొడుకు పనిచేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. కాగా, లాభ్ సింగ్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటూ కొద్దికాలంలోనే కీలక నేతగా ఎదిగాడు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఇది చదవండి: ఆ సినిమాకు ప్రధాని మోదీ ప్రశంసలు.. -
సీఎంను ఓడించిన సామాన్యుడు.. ఎవరతను?
ఎన్నికల ముందు వరకు అతడో సామాన్య యువకుడు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిని మట్టికరిపించి అసామాన్యుడిగా నిలిచాడు. ఈరోజు వరకు అతడి గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలీదు, కానీ ముఖ్యమంత్రిని ఓడించడంతో అతడి పేరు పతాక శీర్షికలకు ఎక్కింది. పంజాబ్ రాజకీయాల్లో సంచలనాలకు తెరతీసిన అతడి పేరు లభ్ సింగ్ ఉగోకే. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బర్నాలా జిల్లా బదౌర్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి లభ్ సింగ్ గెలుపొందారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీపై 37 వేల పై చిలుకు మెజారితో ఘన విజయం సాధించారు. లభ్ సింగ్‌కు 63 వేలకు పైగా ఓట్లు తెచ్చుకోగా, ఛన్నీకి కేవలం 26 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఎవరీ లభ్ సింగ్? 35 ఏళ్ల లభ్ సింగ్ సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. 12 తరగతి వరకు చదువుకుని మొబైల్ రిపేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. అతడి తండ్రి డ్రైవర్ కాగా, తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో వలంటీర్‌గా లభ్ సింగ్ చేరారు. తాజా ఎన్నికల్లో తనను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ప్రజల మధ్య ఉంటూ ఇంటింట ప్రచారం సాగించారు. ఎమ్మేల్యేగా తనను గెలిపిస్తే దౌర్ నియోజకవర్గ ఓటర్ల సమస్యలను పరిష్కరించే బాధ్యతను భుజాన వేసుకుంటానని అని చెప్పి ప్రజల నమ్మకాన్ని పొందారు. తనపై పోటీ చేస్తున్నది ముఖ్యమంత్రి అయినా కూడా లభ్ సింగ్ ఏమాత్రం భయపడలేదు. నిరాడంబరంగా తన ప్రచారం సాగించి విజయాన్ని అందుకున్నారు. లభ్ సింగ్ విజయాన్ని కేజ్రీవాల్ ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందనలు తెలిపారంటే.. ఈ గెలుపు ప్రాముఖ్యత అర్థమవుతోంది. ఆప్ కంచుకోట.. బదౌర్ బదౌర్ నియోజకవర్గంలో రెండు పట్టణాలు, 74 గ్రామాలు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి పిర్మల్ సింగ్ ధౌలా ఇక్కడ విజయం సాధించారు. అయితే గతేడాది ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2012లో బదౌర్‌లో కాంగ్రెస్ విజయం సాధించగా.. 1997, 2002, 2007లో శిరోమణి అకాలీదళ్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాగా, బదౌర్ నియోజకవర్గం తమ పార్టీకి కంచుకోట అని, ముఖ్యమంత్రి పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని ఎన్నికలకు ముందు లభ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. సామాన్యుడికి పట్టంకట్టి సీఎంను ఓడించారు బదౌర్ ఓటర్లు. (క్లిక్: గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?) ఆమెకు డిపాజిట్ గల్లంతు పంజాబ్ డిప్యూటీ స్పీకర్, మలౌట్ ఎమ్మెల్యే అజైబ్ సింగ్ భట్టి భార్య మంజిత్ కౌర్.. బదౌర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా ఆమెకు డిపాజిట్ కూడా దక్కలేదు. శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సత్నామ్ సింగ్ రాహి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. (క్లిక్: కమెడియన్ నుంచి సీఎం స్థాయికి..)