ఎన్నికల ముందు వరకు అతడో సామాన్య యువకుడు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిని మట్టికరిపించి అసామాన్యుడిగా నిలిచాడు. ఈరోజు వరకు అతడి గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలీదు, కానీ ముఖ్యమంత్రిని ఓడించడంతో అతడి పేరు పతాక శీర్షికలకు ఎక్కింది. పంజాబ్ రాజకీయాల్లో సంచలనాలకు తెరతీసిన అతడి పేరు లభ్ సింగ్ ఉగోకే.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బర్నాలా జిల్లా బదౌర్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి లభ్ సింగ్ గెలుపొందారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీపై 37 వేల పై చిలుకు మెజారితో ఘన విజయం సాధించారు. లభ్ సింగ్‌కు 63 వేలకు పైగా ఓట్లు తెచ్చుకోగా, ఛన్నీకి కేవలం 26 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి.
ఎవరీ లభ్ సింగ్?
35 ఏళ్ల లభ్ సింగ్ సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. 12 తరగతి వరకు చదువుకుని మొబైల్ రిపేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. అతడి తండ్రి డ్రైవర్ కాగా, తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో వలంటీర్‌గా లభ్ సింగ్ చేరారు. తాజా ఎన్నికల్లో తనను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ప్రజల మధ్య ఉంటూ ఇంటింట ప్రచారం సాగించారు. ఎమ్మేల్యేగా తనను గెలిపిస్తే దౌర్ నియోజకవర్గ ఓటర్ల సమస్యలను పరిష్కరించే బాధ్యతను భుజాన వేసుకుంటానని అని చెప్పి ప్రజల నమ్మకాన్ని పొందారు. తనపై పోటీ చేస్తున్నది ముఖ్యమంత్రి అయినా కూడా లభ్ సింగ్ ఏమాత్రం భయపడలేదు. నిరాడంబరంగా తన ప్రచారం సాగించి విజయాన్ని అందుకున్నారు. లభ్ సింగ్ విజయాన్ని కేజ్రీవాల్ ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందనలు తెలిపారంటే.. ఈ గెలుపు ప్రాముఖ్యత అర్థమవుతోంది.
ఆప్ కంచుకోట.. బదౌర్
బదౌర్ నియోజకవర్గంలో రెండు పట్టణాలు, 74 గ్రామాలు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి పిర్మల్ సింగ్ ధౌలా ఇక్కడ విజయం సాధించారు. అయితే గతేడాది ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2012లో బదౌర్‌లో కాంగ్రెస్ విజయం సాధించగా.. 1997, 2002, 2007లో శిరోమణి అకాలీదళ్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. కాగా, బదౌర్ నియోజకవర్గం తమ పార్టీకి కంచుకోట అని, ముఖ్యమంత్రి పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని ఎన్నికలకు ముందు లభ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. సామాన్యుడికి పట్టంకట్టి సీఎంను ఓడించారు బదౌర్ ఓటర్లు. (క్లిక్: గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?)
ఆమెకు డిపాజిట్ గల్లంతు
పంజాబ్ డిప్యూటీ స్పీకర్, మలౌట్ ఎమ్మెల్యే అజైబ్ సింగ్ భట్టి భార్య మంజిత్ కౌర్.. బదౌర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా ఆమెకు డిపాజిట్ కూడా దక్కలేదు. శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సత్నామ్ సింగ్ రాహి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. (క్లిక్: కమెడియన్ నుంచి సీఎం స్థాయికి..)
Comments
Please login to add a commentAdd a comment