ముక్కోణ, చతుర్ముఖ పోటీలు
దౌబాలో చాలా స్థానాల్లో త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొంది. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న చమ్‌కౌర్ సాహిబ్ నుంచి సీఎం చన్నీ నాలుగోసారి బరిలో దిగారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఆప్ అభ్యర్థి డాక్టర్ చరణ్‌జిత్ మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక జలంధర్ కాంట్‌లో పంజాబ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, విద్యా, క్రీడల మంత్రి పర్గత్ సింగ్ మూడోసారి బరిలో దిగారు. అకాలీదళ్ నుంచి జగ్బీర్ బ్రార్, బీజేపీ నుంచి సరబ్‌జిత్ సింగ్ మక్కర్, ఆప్ నుంచి సురీందర్ సింగ్ సోధి ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. హోషియార్‌పూర్, ఫగ్వారా, నవాన్‌షహర్ సహా పలు అసెంబ్లీ స్థానాల్లో హోరాహోరీ పోటీ ఖాయంగా కన్పిస్తోంది. దళితులను బాగా ప్రభావితం చేయగల డేరాలను ప్రసన్నం చేసుకునేందుకు కూడా పార్టీలు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి.
ఎన్నారై బెల్ట్‌గా పేరున్న పంజాబ్‌లోని దౌబా ప్రాంతంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు నెగ్గేందుకు కాంగ్రెస్, అకాలీదళ్, ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దళిత ప్రాబల్య ప్రాంతం కావడంతో ఆ వర్గాన్ని ఆకట్టుకొనేందుకు జోరుగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే వారికి రకరకాల వాగ్దానాలు చేశాయి. అకాలీదళ్ తన కుల సమీకరణాలను సరిదిద్దుకొనేందుకు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. దళితులకు డిప్యూటీ సీఎం పదవి ప్రకటించింది. బీజేపీ అయితే వారికి సీఎం పదవే హామీ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ దళితుడైన చరణ్‌జిత్ సింగ్ చన్నీని మళ్లీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. జలంధర్, కపుర్తలా, హోషియార్‌పూర్, నవాన్‌షహర్ జిల్లాలతో కూడిన దౌబాలో 23 అసెంబ్లీ స్థానాలున్నాయి. 20న పోలింగ్ జరగనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ, బీఎస్పీ చీఫ్ మాయావతి తదితరులు ఇప్పటికే దోబాలో ప్రచారం చేశారు. దోబాలో దళితుల రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడి జనాభాలో 45 శాతం దాకా దళితులున్నారని అంచనా. వీరు ప్రధానంగా రెండు వర్గాలు. గురు రవిదాస్ అనుయాయులైన రవిదాసియాలు ఒక వర్గం కాగా, వాల్మీకులు మరో వర్గం. ఇక్కడ రవిదాసియాలది ఆధిపత్యం. దౌబాలోని హోషియార్‌పూర్, జలంధర్ లోక్‌సభ సెగ్మెంట్లను ఎస్సీలకు రిజర్వ్ చేశారు. వీటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో వారి ఆధిపత్యం మరింతగా ఉంది. సన్యశ్యామల ప్రాంతం కావడంతో దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దౌబాలోని దళితులు ఆర్థికంగా బలంగా, ప్రభావశీలంగా ఉన్నారు. ఏ ఎన్నికల్లోనూ వీరు ఒకే పార్టీకి ఏకమొత్తంగా ఓట్లు వేసిన దాఖలాల్లేవు. గత ఎన్నికల్లో దౌబాలో 15 సీట్లు నెగ్గి ఆధిపత్యం ప్రదర్శించిన కాంగ్రెస్‌కు ఈసారి గట్టి పోటీ ఎదురవుతోంది.
– సాక్షి, న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment