అది పంజాబ్‌లోని బటిండా ప్రాంతంలోని ఒక ప్రభుత్వ పాఠశాల. ఆ బడిలో ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిల్లలంతా సందడిగా, టీచర్లు బిజీబిజీగా ఉన్నారు. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అప్పుడే అక్కడికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన వ్యక్తి వచ్చారు. అంతా నమస్కారాలు, పూల దండలతో స్వాగతం పలుకుతున్నారు.
స్కూలు ఆవరణలో ఒకావిడ తన పనిలో నిమగ్నమై ఉంది. వచ్చిన ప్రముఖుడు ఎవరా అని ఆమె తలెత్తి కూడా చూడకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఆమె ఆ ముఖ్య అతిథిని పట్టించుకోకపోవడానికి కారణం.. ఆ వ్యక్తి ఆమె కొడుకే అవ్వడం. సాధారణంగా ఇటువంటి సీన్లు ఎక్కువగా సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే అక్కడ చూపించే వాటిలో.. పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి కూలిపని చేస్తోన్న తల్లిని దగ్గరకు చేరదీయకపోవడం ఎక్కువగా కనిపిస్తుంటుంది.
లభ్ సింగ్ ఉగోకే
కానీ ఇక్కడ అలా జరగలేదు. తన కొడుకు ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ తన తల్లి కొన్నేళ్లుగా చేస్తోన్న స్వీపర్ పనిని వదిలేయకుండా కొనసాగిస్తోంది. అందుకు ఆమె కొడుకు కూడా అభ్యంతరం చెప్పకపోవడం తెలపడం విశేషం. ఈ తల్లీ కొడుకులు మరెవరో కాదు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఇటీవల ఎంఎల్‌ఏగా గెలిచిన లభ్ సింగ్ ఉగోకే, ఆమె తల్లి బల్‌దేవ్ కౌర్.
జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు ఎదుర్కొని ఉన్నతస్థాయికి చేరుకున్నాక తమని తాము మరచిపోయి విజయ గర్వంతో ప్రవర్తిస్తుంటారు చాలామంది. కానీ కొందరు ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ తాము ఎక్కడి నుంచి వచ్చామో అది మాత్రం మర్చిపోరు. తమ నిరాడంబరతను కొనసాగిస్తుంటారు. ఈ కోవకు చెందిన వారే బలదేవ్ కౌర్. ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ..మిగతా పార్టీలన్నింటిని పక్కకు నెట్టేసి ఆమ్‌ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో బదౌర్ నియోజక వర్గంలో పోటీచేసి పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీని ఓడించి లభ్ సింగ్ ఉగోకే గెలిచాడు.
ప్రస్తుతం లభ్ సింగ్ ఉగోకే ఎంఎల్‌ఏ. అయితే ఇతని తల్లి బల్‌దేవ్ కౌర్ గత ఇరవైఐదేళ్లుగా స్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తోంది. కొడుకు ఎంఎల్‌ఏ అయినప్పటికీ ఆమె మాత్రం తన ఉద్యోగాన్ని వదులుకోలేదు. ఇటీవల తన తల్లి పనిచేస్తోన్న స్కూలుకు ఎంఎల్‌ఏగా అధికారిక హోదాలో వచ్చారు. అయినా తల్లీకొడుకులు ఇద్దరూ ఆ విషయంలో ఏమాత్రం ఆత్మన్యూనతకు గురి కాలేదు..ఆ విషయాన్ని సంతోషంగానే స్వీకరించారు.
దర్శన్ సింగ్, బల్‌దేవ్ కౌర్ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో ఒకరు లభ్ సింగ్. నిరుపేద కుటుంబం కావడంతో రెండు గదులున్న చిన్న పూరిల్లే వారి నివాసం. దర్శన్ సింగ్ కూలిపనిచేస్తే, భర్తకు చేదోడుగా బల్‌దేవ్ కౌర్ స్కూల్లో స్వీపర్‌గా పనిచేసి పిల్లలిద్దరిని కష్టపడి చదివించారు. చదువుకున్న లభ్‌సింగ్ రాజకీయాలవైపు ఆకర్షితుడై పదేళ్ల క్రితం ఆప్‌లో చేరి చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకుని ఎంఎల్‌ఏగా ఎదిగారు. కొడుకు ఎంఎల్‌ఏ అయ్యాడని తల్లి అబ్బుర పడిందే తప్ప స్వీపర్ పనిని వదల్లేదు. అయినా ఇప్పటికీ ఈ కుటుంబం రెండు గదులున్న ఇంట్లోనే ఉండడం, ఎప్పుడో కొనుక్కున్న పాత మోటర్ సైకిల్‌నే వాడడం విశేషం.
‘‘మేము బతికేందుకు కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నాం. ఇప్పుడు నా కొడుకు ఎంఎల్‌ఏ అయ్యాడని నేను 25 ఏళ్లుగా చేస్తోన్న పనిని వదులుకోలేను. అతని పని అతనిదే, నా పని నాదే అని సగర్వంగా చెబుతోంది బల్‌దేవ్ కౌర్. నాకొడుకు ఇదే స్కూల్లో చదువుకున్నాడు. స్కూలో ఉన్నప్పుడు ఇటు స్కూలుకు, అటు గ్రామానికి అనేక పురస్కారాలు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎంఎల్‌ఏగా ఎదిగి ఎంతోమందికి మంచి పాలన అందించబోతున్నాడు. మరీ నేను ఎందుకు ఖాళీగా ఉండాలి. నా పనిలో నేను ముందుకు సాగితేనే నాకు ఆనందంగా ఉంటుంది’’ అని కౌర్ చెబుతోంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదే.
Comments
Please login to add a commentAdd a comment